14-01-2026 01:22:56 PM
ఇల్లందులో విద్యాశాఖ అధికారులకు టీడీపీ ఫిర్యాదు
ఇల్లందు,(విజయక్రాంతి): ఇల్లందు పట్టణంలోని మాంటిసోరి స్కూల్ యాజమాన్యం వార్షికోత్సవ కార్యక్రమం పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేసిందని ఆరోపిస్తూ తెలుగుదేశం పార్టీ కోఆర్డినేటర్ ముద్రగడ వంశీ, తెలుగునాడు విద్యార్థి సమైక్య నాయకులు సర్పంచ్ చాందావత్ రమేష్ బాబు, దాసరి గోపాల కృష్ణ విద్యాశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 2న నిర్వహించిన వార్షికోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఒక్కో విద్యార్థి నుంచి వెయ్యి నుంచి రెండు వేల రూపాయల వరకు వసూలు చేసి సుమారు రూ.20 లక్షల 30 లక్షల వరకు సమీకరించినట్లు వారు పేర్కొన్నారు.
కార్యక్రమాల్లో పాల్గొనాలంటే తప్పనిసరిగా డబ్బులు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసి, కాస్ట్యూమ్స్, డాన్స్ కొరియోగ్రఫీ, ఇతర ఖర్చుల పేరుతో పెద్ద మొత్తంలో వసూళ్లు చేశారని, అలాగే ఇచ్చిన కాస్ట్యూమ్స్ కూడా వెనక్కి తీసుకున్నారు. మానసికంగా వేధించిన ఘటనలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. సాయంత్రం నాలుగు గంటలకు మొదలైన వార్షికోత్సవ కార్యక్రమం అర్ధరాత్రి ఒంటిగంట వరకు నిర్వహించి పిల్లలకు తల్లిదండ్రులకు చలిలో ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా మొక్కుబడిగా లడ్డు మిక్చర్ పొట్లాలు పంచడం విడ్డూరంగా ఉందన్నారు.
ఈ చర్యలు ప్రభుత్వ విద్యా నిబంధనలకు విరుద్ధమని, ఇదే పాఠశాల గతంలోనూ ఇలాంటి అక్రమ వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం ఉందని తెలిపారు. ఈ ఘటనపై తక్షణ విచారణ చేపట్టి సంబంధిత పాఠశాల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి అక్రమ వసూళ్లు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే పాఠశాల గుర్తింపును కూడా పరిశీలించాలని కోరుతూ టీడీపీ, టీఎన్‌ఎస్‌ఎఫ్ నాయకులు విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం అందజేశారు.