17 April, 2026 | 8:19 PM

నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయుల నిరసన

17-04-2026 07:03 PM

కుమ్రం భీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): తిర్యాని మండలంలోని గిన్నెధరి ఆశ్రమ పాఠశాలలో శుక్రవారం తెలంగాణ రాష్ట్ర ఉద్యోగ-ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ (టీజేఏసీ) పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం (TSTWTU) ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా TSTWTU పీజీ హెడ్ మాస్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పూర్కా ఉద్దవ్ మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్‌సీ ప్రకటించాలని, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.

సీఆర్టీలకు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, ఉపాధ్యాయులకు బకాయి ఉన్న డీఏలను తక్షణమే మంజూరు చేయాలని కోరారు. కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు పెంచాలని కూడా విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే టీజేఏసీ ఆధ్వర్యంలో దశలవారీగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి నైతం కృష్ణరావు, జిల్లా అధ్యక్షుడు రాథోడ్ రవీందర్, ప్రధాన కార్యదర్శి మాడావి గోపాల్, అధ్యక్షుడు వెడ్మ యశ్వంత్ రావు, కోశాధికారి కూడ్మేత అనంత్ తదితర నాయకులు పాల్గొన్నారు.