30 August, 2026 | 2:53 AM

న్యూయార్క్ చేరుకున్న టీమిండియా

27-05-2024 01:20 AM

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ ఆడేందుకు రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా తొలి బృందం న్యూయార్క్‌కు చేరుకుంది. రోహిత్ సహా 10 మంది భారత ఆటగాళ్లు, కోచ్ రాహుల్ ద్రవిడ్, సపోర్ట్ స్టాఫ్ ఆదివారం ఉదయం న్యూయార్క్ విమానాశ్రయంలో అడుగుపెట్టారు. రోహిత్, బుమ్రా, సిరాజ్, సూర్య, పం త్, దూబే, జడేజా, కుల్దీప్, అక్షర్‌లు ఈ బృందంలో ఉన్నారు. అయితే వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, విరాట్ కోహ్లీ, సంజూ శాంసన్ వేర్వేరు కారణాలతో కాస్త ఆలస్యంగా జట్టుతో జాయిన్ కానున్నా రు. ఐపీఎల్ 17వ సీజన్‌లో రాజస్థాన్‌తో ఎలిమినేటర్ మ్యాచ్ ఓటమి అనంతరం కోహ్లీ వీసా సమస్య కారణంగా భారత్‌లోనే ఉండిపోయాడు. ఇక తన భార్య నటాషాతో విడాకులు తీసుకున్నట్లు వార్తలు వచ్చిన వేళ హార్దిక్ పాండ్యా లండన్‌కు పయనమయ్యాడు. అక్కడి నుంచే నేరుగా అమెరికాకు చేరుకోనున్నాడు. ఇక రాజస్థాన్ రాయ ల్స్ జట్టు సభ్యులైన సంజూ శాంస న్, యజ్వేంద్ర చాహల్, అవేశ్ ఖాన్‌లు సోమవారం టీమిండియాతో కలవనున్నారు. మెగాటోర్నీ ప్రారంభానికి ముందు టీమిండియా జూన్ 1న బంగ్లాదేశ్‌తో ఏకైక వార్మప్ మ్యాచ్ ఆడనుంది.