24 July, 2026 | 3:22 AM

సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించాలి

24-07-2026 12:00 AM

అంతరిక్ష శాస్త్రవేత్త, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి

ఘట్‌కేసర్, జూలై 23 (విజయక్రాంతి) : విద్యార్థులు తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించాలని అంతరిక్ష శాస్త్రవేత్త, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి అన్నారు.  ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్ పరిధిలోని నల్ల మల్లా రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, డీఆర్డీవో మాజీ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పట్టభద్రులను ఉద్దేశించి ప్రసంగించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2047 నాటికి వికసిత భారత్ సాధనలో యువ ఇంజనీర్లు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. పరిశోధనలు, ఆవిష్కరణలు, పారిశ్రామిక రంగాల్లో ముందుకు సాగి ఉద్యోగాలు కోరేవారిగా కాకుండా ఉద్యోగాలను కల్పించే వారిగా ఎదగాలని, సాంకేతిక పరిజ్ఞానాన్ని సమాజ అభివృద్ధికి వినియోగించాలని విద్యార్థులకు సూచించారు.

కార్యక్రమానికి కళాశాల ఛైర్పర్సన్ కేతిరెడ్డి సంధ్యావళి, కార్యదర్శి  నల్ల మల్లారెడ్డి, డైరెక్టర్ డాక్టర్ దివ్య నల్ల, ప్రొఫెసర్ డాక్టర్ స్నేహ నల్ల, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.ఎన్.వి. రమేష్ తదితరులు హాజరయ్యారు. కార్యక్రమంలో ముఖ్య ఘట్టంగా కళాశాల కార్యదర్శి నల్ల మల్లారెడ్డి పట్టభద్రులతో గ్రాడ్యుయేట్ ప్రమాణం చేయించారు.

తమ వృత్తి జీవితమంతా నైతిక విలువలు, నిజాయితీ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు, వెండి పతకాలను ముఖ్య అతిథి చేతుల మీదుగా ప్రదానం చేశారు. మైనర్ ప్రోగ్రామ్ లను పూర్తి చేసిన విద్యార్థులను సత్కరించారు.