calender_icon.png 12 August, 2025 | 3:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆంధ్రా వ్యక్తికి తెలంగాణ సీఎంఆర్‌ఎఫ్!

12-08-2025 12:18:07 AM

  1. ఇంటి పేరులో మార్పుతో తతంగం
  2. తెలంగాణ చెక్కు ఏపీలో మార్పిడి
  3. ఓ బాధితుడి ఫిర్యాదుతో బయటపడ్డ బాగోతం
  4. ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకుడు? 
  5. పోలీసుల అదుపులో నిందితులు

సూర్యాపేట, ఆగస్టు 11 (విజయక్రాంతి): తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఏపీకి చెందిన వ్యక్తికి మంజూరైంది. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి దవాఖానాలో చేరి రూ.5 లక్షలు వెచ్చించి చికిత్స చేయించుకున్నాడు. తదుపరి సీఎంఆర్‌ఎఎఫ్‌కు దరఖాస్తు చేసుకోగా.. అదే పేరు కలిగిన మరో వ్యక్తికి (ఇంటి పేరు మార్చి) కేవలం ఇనిషియల్‌తో మాత్రమే చెక్కు వచ్చేలా చేశారు కొందరు మధ్యవర్తులు. ఈ వ్యవహారం సూర్యాపేట జిల్లా కోదాడలో వెలుగులోకి వచ్చింది. 

వెలుగులోకి వచ్చింది ఇలా

కోదాడ నియోజకవర్గం అనంతగిరి మండలం వాయిల సింగారంకు చెందిన గద్దె వెంకటేశ్వరరావు 2013వ సంవత్సరంలో మూడు గుండె కవాటాలు మూసుకుపోగా రూ.ఐదు లక్షలు వెచ్చించి చికిత్స చేయించుకున్నాడు. తదుపరి 2022లో మరోసారి మూడు వాల్వ్‌లు మూసుకపోగా హైదరాబాదులోని కొండాపూర్ కిమ్స్‌లో చికిత్స చేయించుకున్నారు. దీనికి గాను రూ.4.5 లక్షల ఖర్చు అయింది. ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం 2022లో దరఖాస్తు చేసుకున్నారు.

నాటి ఎమ్మెల్యే కార్యాలయం చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది. తదుపరి ఎన్నికలు జరిగి ప్రభుత్వం మారడంతో చాలాకాలం ఎదురు చూడాల్సి వచ్చింది. అయినా నిధులు రాకపోవడంతో ప్రస్తుత ఎమ్మెల్యే పద్మావతిని కలిసి తన గోడు వెళ్లబోసుకున్నాడు. స్పందించిన ఆమె ఆరా తీయాలని సిబ్బందిని ఆదేశించింది. ఫైల్ నెంబర్ అని తెలుసుకున్న సిబ్బంది బాధితుడికి వివరాలు అందించి దాని స్టేటస్‌ను తెలుసుకోమని చెప్పారు.

వెంకటేశ్వరరావు హైదరాబాదులోని ముఖ్యమంత్రి సహాయనిధి కార్యాలయంలో ఆరా తీయగా ఆగస్టు 30, 2023న చెక్కు మంజూరైనట్టు వివరించారు. ఆ చెక్కును ఏప్రిల్ 19, 2024న మార్చుకుని, రూ1.50 లక్షలు తీసుకున్నట్లు తెలిసింది. చెక్కు నంబర్‌ను తెలియజేస్తూ ఎస్బిఐ హెడ్ ఆఫీస్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ చెక్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జగ్గయ్యపేట ఎస్బిఐ బ్రాంచ్‌లో మార్పిడి జరిగినట్టు వివరాలు తెలిశాయి.

అక్కడికి వెళ్లి ఆరా తీయగా జగ్గయ్యపేటకు చెందిన జి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి డ్రా చేసినట్లు తెలుసుకోగలిగారు. వెంటనే అతని వివరాలు, ఫోన్ నంబరును చేజిక్కించుకుని ఆయనను సంప్రదించగా ఆది తనదేనని, నా పేరు టే చెక్కు వచ్చిందని బుకాయించాడు. అయితే బాధితుడు తెలంగాణ రాష్ట్ర చెక్కు ఆంధ్రకు చెందిన వ్యక్తికి ఎలా ఇస్తారు అని గట్టిగా ప్రశ్నించడంతో అసలు విషయాన్ని ఒప్పుకున్నట్టు తెలిసింది.

తదుపరి ఫోన్ లో ఈ వ్యవహారంలో నలుగురు వ్యక్తులు ఉన్నారని అతనే చెప్పినట్లు విశ్వసనీయ సమా చారం. కాగా తమ పేరున వచ్చిన డబ్బులు మాకు ఇవ్వాలని అడగడంతో సదరు వ్యక్తి ఫోన్ స్విచ్ ఆప్ చేసినట్లు తెలిసింది. బాధితుడు గద్దె వెంకటేశ్వరరావు పేరును గడ్డం వెంకటేశ్వరరావుగా మార్చి అతని పేరును చెక్కు మీద జీ వెంకటేశ్వరరావుగా చేర్చి డబ్బులను స్వాహా చేయడం కొస మెరుపు.

ఇక చేసేది ఏమిలేక సంబంధిత వ్యక్తిపై కోదాడ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. నిందితులపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న ఒక కీలక వ్యక్తితో పాటు మరో ఇద్దరిని అదుపులోనికి తీసుకున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తుంది. 

అసలు సూత్రధారి మాజీ ఎమ్మెల్యే పీఏ

అసలు ఈ తతంగానికి అంతటికి ప్రధాన సూత్రధారి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పీఏ అని తెలిసింది. అతనితో పాటు ఎమ్మెల్యే అనుచరుడు మరొకరు, జగ్గయ్యపేటకు చెందిన వెంకటేశ్వరరావు, మరో వ్యక్తి భాగస్వాములుగా ఉంటూ ఈ వ్యవహారం నడిపినట్లు తెలుస్తుంది. అయితే వీరందరు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం.

50 నుంచి 100 మంది లబ్ధిదారుల చెక్కులను ఇలానే స్వాహా చేసినట్లు కోదాడ నియోజకవర్గంలో వార్తలు  గుప్పుమంటున్నాయి. అయితే పోలీసులు జగ్గయ్యపేటకు చెందిన వ్యక్తితోపాటు మాజీ ఎమ్మెల్యే పీఏ, మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వినికిడి. ఈ విషయంపై ప్రస్తుత ఎమ్మెల్యే పద్మావతి స్పందిస్తూ సీఎంఆర్‌ఎఫ్ నిధుల అవకతవకలకు పాల్పడితే వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు.