సంక్షేమంలో దేశంలో నెంబర్ 1 తెలంగాణ
ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్రు నాయక్
మహబూబాబాద్, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అగ్రశ్రేణిగా నిలుస్తోందని, భూభారతి నూతన చట్టంతో ఇక భూముల సమస్యలు ఉండవని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రు నాయక్ తెలిపారు. గురువారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్ల చర్ల లో భూభారతి చట్టం అమలు తీరుపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడానికి వివిధ సంక్షేమ పథకాలు అమలు చేయడంతో పాటు మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం, యువత స్వయం సమృద్ధి సాధించేందుకు రాజీవ్ యువ వికాసం, సన్నవడ్లకు క్వింటాలుకు 500 రూపాయలు బోనస్, నిరుపేద కుటుంబాలకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కే.వీరబ్రహ్మచారి, ఆర్డీవో కృష్ణవేణి, జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల, ల్యాండ్ సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ నరసింహమూర్తి, తహసిల్దార్ కృష్ణవేణి, ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






