13 May, 2026 | 10:07 AM

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి

28-08-2024 12:06 PM

హైదరాబాద్: తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 60 ఏళ్ల తెలంగాణ ఆకాంక్షను సోనియా గాంధీ నెరవేర్చారని సీఎం పేర్కొన్నారు. 2014లో తెలంగాణ ఏర్పాటు కల సాకారమైందని, తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు గత పాలకులకు మనసు రాలేదని రేవంత్ రెడ్డి తెలిపారు. తామే తెలంగాణ అనే విధంగా గత పాలకులు వ్యవహరించారన్నారు. ప్రగతి భవన్ లో గడి నిర్మించుకుని పోలీసు పహారా పెట్టారని ముఖ్యమంత్రి చెప్పారు. గత ప్రభుత్వ విధానాలకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం అని, అందుకు ప్రగతి భవన్ ను ప్రజా భవన్ గా మార్చాం అని ఆయన వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని సీఎం కొనియాడారు. రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించిన నేతల ఆనవాళ్లు ఇక్కడ ఉన్నాయని, రాజీవ్ గాంధీ విగ్రహం లేకపోవడం లోటుగా భావించామని చెప్పుకోచ్చారు. రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని మేధావులు సూచించారు. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుపై జూన్ 2న ప్రకటించామని, తెలంగాణ ఏర్పాటుకు డిసెంబర్ 9 పునాదిరాయిగా మారిందన్నారు. తెలంగాణ ప్రజలకు డిసెంబర్ 9 పండుగ రోజు అని, ఆ రోజే తెలంగాణ తల్లి విగ్రహ ప్రారంభోత్సవం జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.