09-12-2025 12:00:00 AM
గులాబీ శ్రేణులకు బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విజ్ఞప్తి
నిజామాబాద్, డిసెంబర్ 8 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తూ చిదంబరం ప్రకటన వెలువడిన డిసెంబర్ 9వ తేదీని ‘విజయ్ దివస్’గా ఘనంగా నిర్వహించలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు డిసెంబర్ 9న జిల్లా వ్యాప్తంగా చరిత్రలో నిలిచిపోయేలా విజయ్ దివస్ కార్యక్రమాన్ని పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పండుగలా నిర్వహించాలని బీఆర్‌ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఒక పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.
కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు తలొగ్గి, కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రోజు డిసెంబర్ 9 అని ఆయన గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వెలువడిన రోజును సంబరంగా నిర్వహించుకోవాలని ఆయన కోరుతూ సర్పంచి ఎన్నికల కారణంగా గ్రామాల్లో కాకుండా కేవలం నియోజకవర్గ కేంద్రాల్లో మాత్రమే ఈ కార్యక్రమాలను నిర్వహించాలని జీవన్ రెడ్డి సూచించారు.
ఈ సందర్భంగా డిసెంబర్ 9న నియోజకవర్గ కేంద్రాల్లోని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకం చేయాలని, డాక్టర్ బీఆర్‌అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాలని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు పండ్లు పంపిణీ చేయాలని కోరారు. పార్టీ కార్యాలయాల వద్ద , ప్రధాన కూడళ్లలో విజయానికి సూచికగా గులాబీ బెలూన్లను గాలిలోకి ఎగుర వేయాలన్నారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఈ కార్యక్రమాలు విజయవంతం అయ్యేలా సమన్వయం చేసుకోవాలని జీవన్ రెడ్డి పార్టీ నేతలకు సూచించారు.