calender_icon.png 14 July, 2025 | 9:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆలయసత్రాలే ప్రభుత్వ కార్యాలయాలు

14-07-2025 12:00:00 AM

-రెవెన్యూ కార్యాలయానికి ప్రభుత్వ భూమి కరువు 

-అద్దె చెల్లించలేని స్థితిలో తహసీల్దార్ కార్యాలయం

-సుమారు రూ.10లక్షలు బకాయి

సిద్దిపేట, జులై 13 (విజయక్రాంతి): నిత్యం రద్దీగా ఉండే కొమురవెల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలకు ఆలయసత్రాలే దిక్కయ్యాయి. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చేరువలో ఉండటం, రాజీవ్ రహదారిని అనుకోని రెవెన్యూ గ్రామాలు ఉండడం ఈ మండలానికి భలే డిమాండ్ ఉంటుంది. కానీ రెవెన్యూ కార్యాలయానికి భవనం నిర్మించేందుకు ప్రభుత్వ స్థలం లేదంటూ అధికారులు సాకు చెప్పడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి.

కొమురవెల్లి మండలంగా ఏర్పడి 10 సంవత్సరాలు గడిచినప్పటికీ పోలీస్ స్టేషన్ కు మాత్రమే స్థలం కేటాయించి భవన నిర్మాణం జరిగింది. మండల పరిషత్ కార్యాలయం ఆలయసత్రం భవనంలోనే కొనసాగుతుండగా ప్రవేటు అద్దె భవనంలో తహసిల్దార్ కార్యాలయం కొనసాగుతుంది. తహసిల్దార్ భవనం ఖాళీ చేయాలంటూ ఓనరు ఇటీవలే ఆదేశించినట్లు తెలిసింది. అయితే మరెఎక్కడ కార్యాలయానికి సరిపడే భవనాలు లేకపోవడంతో ఆ భవనాన్ని అధికారులు ఖాళీ చేయలేకపోతున్నారు.

ఇదివరకు పోలీస్ స్టేషన్ కొనసాగిన ఆలయ భవనంలోకి తహసిల్దార్ కార్యాలయాన్ని మార్చేందుకు ఆలయ అధికారులు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో ఉన్నతాధికారులకు నివేదిక పంపించారు. మండల విద్యాధికారి కార్యాలయం స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో కొనసాగుతుండగా, వ్యవసాయ శాఖ కార్యాలయం రైతు వేదికలో కాలమెల్లదిస్తుంది. ఐకెపి భవనానికి గ్రామైక్య సంఘం భవనం సరిపడింది. నిత్యం ప్రజలకు అవసరమైన మిషన్ భగీరథ, పంచాయతీరాజ్, కార్యాలయాల ఊసే లేదు. 

ప్రభుత్వ భూమి లేదు.. 

తహసిల్దార్ కార్యాలయం కొనసాగుతున్న భవనానికి సుమారు రూ.10 లక్షలు అద్దె బకాయి ఉండటం ఖాళీ చేయడానికి ప్రధాన కారణమని స్థానికులు తెలిపారు. ఆధ్యాత్మిక రంగంలో అత్యంత పేరుగాంచిన కొమురవెల్లి రెవెన్యూ పరిధిలో ప్రభుత్వ భూమి లేదంటూ అధికారులు చెప్పటం పట్ల పలువురు విమర్శలు చేస్తున్నారు. సామూహిక ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణం కోసం సుమారు 2 ఎకరాల భూమి అవసరం ఉంటుందని అందుకు సంబంధించిన భూసేకరణ జరగకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి, నాయకుల పట్టింపులేనితనానికి నిదర్శనమని స్థానికులు మండిపడుతున్నారు. ఆలయా భవనాలలో కొనసాగుతున్న కార్యాలయాల్లో వసతులు లేమి ప్రజలకు అసౌకర్యంగా మారిందని జిల్లా అధికారులు జోక్యం చేసుకొని కార్యాలయాల ఏర్పాటుకు కృషి చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. 

ఖాళీ చేయాలన్నది నిజమే.. 

మండల కేంద్రం ఏర్పాటైనప్పటి నుండి తహసిల్దార్ కార్యాలయం ప్రైవేటు అద్దె భవనంలో కొనసాగుతుంది. అద్దె చెల్లింపులో జాప్యం అవడం వల్లనే ఓనరు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్న విషయం నిజమే. ప్రస్తుతానికి కార్యాలయానికి సరిపడే భవనం మరెక్కడ లేకపోవడంతో ఇదివరకు పోలీస్ స్టేషన్ కొనసాగిన భవనాన్ని అద్దెకి ఇవ్వాలంటూ ఆలయ అధికారులకు నివేదిక పంపించాం. త్వరలోనే కార్యాలయాన్ని ఖాళీ చేసి ఆలయ సత్రంలోకి మార్చుతాం. సామూహిక ప్రభుత్వ భవనాలు నిర్మించేందుకు స్థలాన్ని పరిశీలిస్తున్నము. భూ సేకరణ చేసి జిల్లా అధికారులకు నివేదిక అందిస్తాం.

 దివ్య, తహసిల్దార్, కొమురవెల్లి.