14-07-2025 12:00:00 AM
గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్
గజ్వేల్, జులై 13: సీఎం రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన చారిత్రాత్మక పథకాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటుతామని గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్దార్ ఖాన్ పేర్కొన్నారు. ఆదివారం గజ్వేల్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 18 నెలల వ్యవధిలో సీఎం రేవంత్ రెడ్డి పంట రుణమాఫీ, ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, సన్న బియ్యం పంపిణీతో పేద వర్గాల్లో హర్షం వ్యక్తమవుతుందన్నారు.
అయితే గత ఎమ్మెల్యే ఎన్నికలతో పోల్చుకుంటే నియోజకవర్గంలో పార్టీ బలం మరింత పెరిగిందని, డిసిసి అధ్యక్షులు నర్సారెడ్డి నేతృత్వంలో కార్యకర్తలు కష్టపడి పని చేస్తూ పేదల కష్టసుఖాలలో భాగస్వాములవుతున్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్ అమలుకు చర్యలు తీసుకోవడం మంచి పరిణామమని అన్నారు.
కష్టపడిన ప్రతి కార్యకర్తకు నామినేటెడ్ పోస్టులు, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించేందుకు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ప్రత్యేక చొరవతో దశలవారీగా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. గజ్వేల్ మున్సిపల్ తో పాటు నియోజకవర్గంలో సర్పంచులు ఇతర అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని, ఇందుకోసం ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్ష కార్యదర్శులు మొనగారి రాజు, రాములు గౌడ్, మజీద్ కమిటీ చైర్మన్ మథిన్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు అజహర్ నాయకులు లక్ష్మారెడ్డి, గుంటూకు శ్రీనివాస్, అస్గర్, గాడిపల్లి శ్రీనివాస్, రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.