పాలస్తీనాలో 10 మంది భారతీయులు బందీ
కాపాడి, సురక్షిత ప్రాంతానికి తరలించిన ఇజ్రాయెల్
న్యూఢిల్లీ: పాలస్తీనాలోని వెస్ట్‌బ్యాంకులో బందీలుగా ఉన్న 10 మంది భారత నిర్మాణ కార్మికులను ఇజ్రాయెల్ సైన్యం(Israeli army) రక్షించింది. భారతీయుల పాస్‌పోర్టులను ఉపయోగించి కొందరు పాలస్తీనియన్లు ఇజ్రాయెల్‌కు అక్రమంగా ప్రవేశిస్తూ తాజాగా భద్రతా దళాలకు దొరికిపోయారు. ఈ క్రమంలోనే 10 మంది భారతీయులు వెస్ట్‌బ్యాంకు గ్రామంలో బందీలుగా ఉన్నట్టు ఇజ్రాయెల్ సైన్యం గుర్తించింది.
దీంతో పాపులేషన్ అండ్ ఇమ్మిగ్రేషన్ అధికారుల(Population and Immigration Officers) సహకారంతో రాత్రివేళ ఇజ్రాయెల్ సైన్యం ఆపరేషన్ నిర్వహించి, బందీలుగా ఉన్న కార్మికులను రక్షించడంతోపాటు వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. కాగా నెల రోజుల క్రితం ఇజ్రాయెల్‌లో పని చేస్తున్న కార్మికులను కొందరు పాలస్తీనియన్లు పని పేరుతో వెస్ట్ బ్యాంకు రప్పించి, అక్కడ వారి పాస్‌పోర్ట్‌లను లాక్కోవడంతోపాటు బందించినట్టు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.






