23-10-2025 12:02:04 PM
హైదరాబాద్: లక్డీకపూల్ లోని డీజీపీ శివధర్ రెడ్డి కార్యాలయం(DGP Shivadhar Reddy office) వద్ద గురువారం భారీ ఉద్రిక్తత చోటుచేసుకుంది. డీజీపీ కార్యాలయం ముట్టడికి బీజేపీ నేతలు ప్రయత్నించారు. అప్రమత్తమైన పోలీసులు బీజేపీ నేతలను అసెంబ్లీ వద్ద అడ్డుకున్నారు. పోచారంలో నిన్న సోనూసింగ్ పై కాల్పుల ఘటనను నిరసిస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. ముందు జాగ్రత్తగా డీజీపీ కార్యాలయం(DGP office) వద్ద పోలీసు భద్రత పెంచారు. లక్డీకాపూల్, ఖైరతాబాద్, బషీర్ బాగ్ ప్రాంతాల్లో పోలీసులు పహారా కాస్తున్నారు. బీజేపీ నాయకుల ఆందోళనతో అసెంబ్లీ వద్ద ట్రాఫిక్ జామ్ అయింది. ఆందోళన చేస్తున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పోచారంలో బుధవారం గోరక్షకుడిపై జరిగిన హత్యాయత్నానికి సంబంధించి రాచకొండ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. రాంపల్లి నివాసి సోను సింగ్ అలియాస్ ప్రశాంత్ పై పశువుల వ్యాపారి ఇబ్రహీం దేశీయంగా తయారు చేసిన ఆయుధంతో కాల్పులు జరపడంతో గాయపడ్డాడు. గోవుల తరలింపు గురించి గో రక్షాధల్ కు సమాచారం ఇస్తున్నాడని ఇబ్రహీం సోనూసింగ్(Sonu Singh) పై కక్ష పెంచుకున్నాడు. నిన్న కారులో వెళ్తున్న సోనూసింగ్ ను యంనంపేట వద్ద ఇబ్రహీం అడ్డుకున్నాడు. కారు ఆపి సమీపంలోని వెంచర్ లోకి తీసుకెళ్లి రౌడీషీటర్ ఇబ్రహీం కాల్పులు జరిపాడు. ప్రస్తుతం బాధితుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సోనూ సింగ్ శరీరం నుంచి వైద్యులు బుల్లెట్ ను బయటకు తీశారు. ప్రస్తుతం సోనూ సింగ్ ఐసీయూలో చికిత్స పొందుతున్నాడని వైద్యులు తెలిపారు.
జరిగిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన సోను (ప్రశాంత్)ను బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో పరామర్శించారు. శాంతి పరిరక్షణ కోసం కృషి చేస్తూ గాయపడిన వ్యక్తిపై దాడి జరగడం అత్యంత దారుణని మండిపడ్డారు. బాధితుడి ఆరోగ్యంపై విచారం వ్యక్తం చేస్తూ, మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ఇటువంటి హింసాత్మక చర్యలను ఎప్పటికీ సహించదన్న రామచందర్ రావు తక్షణమే ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.