నర్సంపేటలో ఉద్రిక్తత
- మాజీ ఎమ్మెల్యే పెద్ది విగ్రహం తొలగింపుపై బీఆర్‌ఎస్ శ్రేణుల నిరసన
- కన్నీరు మున్నీరైన పెద్ది భార్య స్వప్న
- నేడు నర్సంపేట బంద్‌కు బీఆర్‌ఎస్ పిలుపు
మహబూబాబాద్, ఆగస్టు 18 (విజయక్రాంతి): నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహం తొలగింపు నర్సంపేటలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మంగళవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో భారీ పోలీసు బందోబస్తు మధ్య విగ్రహాన్ని తొలగించి వరంగల్‌కు తరలించి, గద్దెను పూర్తిగా తొలగించారు. బీఆర్‌ఎస్ శ్రేణులు నర్సంపేట, పెద్ది సుదర్శన్‌రెడ్డి స్వగ్రామం నల్లబెల్లిలో ఆందోళనకు దిగారు. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి దిష్టిబొమ్మతో నల్లబెల్లిలో శవయాత్ర నిర్వహించి దహనం చేశారు. నల్లబెల్లిలో నీళ్ల ట్యాంకు ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. పెద్ది విగ్రహం తొలగింపును నిరసిస్తూ బుధవారం నర్సంపేట బందుకు బీఆర్‌ఎస్ పిలుపునిచ్చింది.
ప్రజా నాయకుడు, దివంగత పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించి తొలగించడం హేయమైన చర్యగా మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ మధుసూదనా చారి అభివర్ణించారు. తన భర్త పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించిన ఘటన తెలుసుకున్న ఆయన సతీమణి స్వప్న కన్నీరు మున్నీరయ్యారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి జన్మదినం రోజు కావాలనే నిరంకుశ వైఖరితో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని తొలగించారని విమర్శించారు. తొలగించిన పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని ప్రభుత్వమే నర్సంపేట ప్రధాన కూడలిలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
పెద్ది విగ్రహం తొలగింపు పాశవిక చర్య: కేటీఆర్
పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించడం ద్వారా రేవంత్ ప్రభుత్వం మరోమారు తన పాశవికత్వాన్ని చాటిందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నర్సంపేట గడ్డపై పెద్ది విగ్రహం నిలబడితేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయా? అందుకే పోలీసులను ఉసిగొల్పి విగ్రహాన్ని తొలగిస్తారా? అని మండిపడ్డారు. రేవంత్ మెప్పుకోసం పోలీసులు దొంగల్లా వ్యవహరించాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ నాయకులు చెప్పినట్టల్లా పోలీసులు నడుచుకో వద్దని, చట్టాన్ని, ప్రజాస్వామ్య విలువలను గౌరవించాలని కేటీఆర్ హితవు పలికారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనే విషయాన్ని పోలీసులు, కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తుంచుకోవా లని హెచ్చరించారు. ఉమ్మడి జిల్లాలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఈ అంశంపై నిరస నలు తెలియజేస్తే వారిని అరెస్టు, గృహనిర్బం ధం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహం తొలగింపును ఖండిస్తున్నామని, ఈ వ్యవహారంపై ప్రభుత్వం తక్షణమే వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. అరెస్టు చేసిన నాయకులను, కార్యకర్తలను వెంటనే భేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
విగ్రహం తొలగింపు దారుణం
నర్సంపేటలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాన్ని రాత్రికి రాత్రే ఎలాంటి నోటీసులు లేకుండా తొలగించడం దారుణమ ని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పెద్ది’ విగ్రహం తొలగింపు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డే కారణమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. విగ్రహాన్ని తొలగించి శాంతిభద్రతల సమస్యను సృష్టించవద్దని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి హెచ్చరించారు. నర్సంపేటను మరోమారు సమస్యాత్మక ప్రాంతంగా మార్చేందుకు ప్రయత్నం జరుగుతోందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు.






