calender_icon.png 16 December, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిడ్నీపై ముష్కరుల పంజా

15-12-2025 12:58:27 AM

  1. బాండీ బీచ్‌లో విచక్షణారహితంగా కాల్పులు
  2. యూదుల వేడుకలో ఘటన 
  3. 11మంది మృతి.. 29మందికి గాయాలు
  4. ఒక షూటర్ హతం.. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  5. ముష్కరుల్లో ఒకరు సిడ్నీకి చెందిన నవీద్ అక్రమ్‌గా గుర్తింపు
  6. ఇది ఉగ్రవాద చర్య : ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ 

సిడ్నీ, డిసెంబర్14 : ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కాల్పుల కలకలం రేగింది. ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన బాండీ బీచ్‌లో ఆదివారం సాయంత్రం ఇద్దరు ముష్కరులు షాట్‌గన్స్‌తో హనుక్కా వేడుక జరుపుకుంటున్న యూదులపై కాల్పులు జరపడంతో  పిల్లలు, ఒక పోలీసు అధికారి సహా మొత్తం 11 మంది మరణించారు. భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఉగ్రవాది కూడా హతమవ్వగా ఇద్దరు పోలీసులతో కలిపి 29మంది గాయపడ్డారు.

మరో ఉగ్రవాదితో పాటు అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పుల ఘటనతో అప్రమత్తమైన పోలీసులు, భారీ భద్రతను ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రజలు అటువైపు రావొద్దని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం 6:45 గంటల సమయంలో బాండీ బీచ్‌లో పలువురిపై కాల్పులు జరిగాయని సమాచారం అందడంతో న్యూ సౌత్ వేల్స్ అంబులెన్స్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించి, సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు.

కాల్పుల శబ్దాలు, పోలీసు సైరన్లతో బాండీ బీచ్ ప్రాంతం దద్దరిల్లింది. ప్రాణభయంతో  పర్యాటకులు, స్థానికులు పరుగులు తీస్తున్న దృశ్యాలతో కూడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నల్ల దుస్తులు ధరించిన ఇద్దరు వ్యక్తులు బాండీ బీచ్‌లోని ఒక బ్రిడ్జి వద్ద కాల్పులు జరిపినట్టు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం పోలీసులు ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. బీచ్‌లో విచ్చలవిడిగా కాల్పులు జరుపుతున్న దుండగుడితో స్థానిక పౌరుడు అడ్డుకున్న వీడియో కూడా వైరల్ అవుతోంది.

సిడ్నీలోని బోండి బీచ్‌లో జరిగిన ఘోరమైన సామూహిక కాల్పుల్లో పాల్గొన్న ముష్కరుల్లో ఒకరు సిడ్నీలోని బోనిరిగ్లోనికి చెందిన 24 ఏళ్ల నవీద్ అక్రమ్‌గా గుర్తించారు. ఇటీవలి కాలంలో ఆస్ట్రేలియాలో జరిగిన ఘోరమైన దాడుల్లో ఒకదానిపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నవీద్ అక్రమ్ ఇంటిపై పోలీసులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అనుమానితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్లు న్యూ సౌత్‌వేల్స్ పోలీసులు ప్రకటించారు. ఇది ఉగ్రవాద చర్యగా ప్రకటిస్తూ ఈ ప్రాంతంలో పోలీస్ ఆపరేషన్ కొనసాగుతోందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించించారు. 

కాల్పుల ఘటన దిగ్భ్రాంతికరం  

బాండీ బీచ్ సమీపంలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్బనీస్ అన్నారు. ఇది విధ్వంసకర ఉగ్రవాద చర్యగా ఆయన అభివర్ణించారు.  ఈ దృశ్యాలు అత్యంత షాకింగా, కలవరపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు.‘ ప్రాణాలను కాపాడేందుకు పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగి పనిచేస్తున్నారు.

ఈ ఘటనలో ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. నేను ఇప్పుడే భద్రతా దళాల అధికారులతో మాట్లాడాను. మరింత సమాచారం ధ్రువీకరించుకున్న తర్వాత పూర్తి వివరాలు అందిస్తాము. పరిసర ప్రాంతాల ప్రజలు పోలీసుల సూచనలను పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నాను‘ అంటూ అల్బనీస్ ట్వీట్ చేశారు. ఘటనా స్థలంలో పోలీస్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని, ప్రజలు ఆ ప్రాంతానికి దూరంగా ఉండాలని న్యూ సౌత్ వేల్స్ పోలీసులు సూచించారు.  

దాడిపై ప్రధాని మోదీ ఖండన

ఈ దాడిపై ప్రధాని మోదీ ‘ఎక్స్’ వేదికగా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్ వద్ద, యూదుల పండుగ హనుక్కా తొలిరోజు వేడుకలు జరుపుకుంటున్న వారిని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఘోర ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. భారత ప్రజల తరఫున, ఈ దాడిలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఈ విషాద సమయంలో ఆస్ట్రేలియా ప్రజలకు మేం అండగా ఉంటాం.  ఉగ్రవాదంపై జరిగే పోరాటానికి సంపూర్ణంగా మద్దతు ఇస్తాం’ అని ట్వీట్ చేశారు.

దాడి యూదు వ్యతిరేక చర్య

ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఆరోపణ

ఈ దాడి యూదు వ్యతిరేక చర్యేనని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి గిడియాన్ సార్ ఆరోపించారు.  రెండేళ్లుగా ఆస్ట్రేలియాలో యూదు వ్యతిరేకత పెరిగిపోవడమే ఈ ఘటనకు కారణమని  తెలిపారు. యూదు సమాజ రక్షణలో అల్బనీస్ ప్రభుత్వం విఫలమైందని ఆస్ట్రేలియన్ జూయిష్ అసోసియేషన్ సీఈఓ రాబర్ట్ గ్రెగొరీ విమర్శించారు. ఎన్నోసార్లు హెచ్చరించినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.