29 June, 2026 | 6:09 PM

వివాహేతర బంధానికి అడ్డుగా ఉందని..

13-06-2024 02:08 AM

పసికందు హత్య

సూర్యాపేట జిల్లాలో అమానుషం

పరారీలో నిందితుడు

సూర్యాపేట, జూన్ ౧౨ (విజయక్రాంతి): వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉందని 22 నెలల పసికందును చంపాడో ఉన్మాది. ఈ అమానుష ఘటన సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం ఐలాపురంలో మంగళవారం చోటు చేసుకోగా తల్లి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బుధవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం సాఠాపూర్‌కు చెందిన మౌత్క విజయ, సాయిల్ దంపతుల కుమార్తె రమ్య అలియాస్ నవ్యశ్రీకి అదే మండలం గుండారం గ్రామానికి చెందిన  లక్ష్మణ్‌తో ఆరేళ్ల క్రితం వివాహమైంది.

దంపతులకు ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె అరుణ్యకు 4 సంవత్సరాలు కాగా రెండో కుమార్తె మహాన్వికి 22 నెలలు. నవ్యశ్రీ అత్తగారి గ్రామానికి చెందిన బుల్లింకా అరవింద్‌రెడ్డితో ఏడు నెలల క్రితం వివాహేత సంబంధం పెట్టుకుంది. దీంతో అరవింద్ రెడ్డి నవ్యశ్రీ తో పాటు తన ఇద్దరు పిల్లల్ని చూసుకుంటానని నమ్మబలికి 20 రోజుల క్రితం నిజామాబాద్ జిల్లా నుంచి చివ్వెంల మండలం ఐలాపురానికి తీసుకొచ్చి అద్దె గదిలో ఉంచాడు. ఈ నెల 11న మంగళవారం 22 నెలల పాప నిద్రిస్తుండగా పెద్ద కుమార్తె అరుణ్యను తీసుకొని కిరాణం దుకాణం వద్దకు నవ్యశ్రీ వెళ్ళింది. 

ఈ సమయంలో నిద్రిస్తున్న మహాన్విని కిరాతకంగా చంపి అరవింద్‌రెడ్డి అక్కడి నుంచి పారిపోయాడు. ఇంటికొచ్చి చూసేవరకు విగత జీవిగా ఉన్న బిడ్డను చూసి ఏమి చేయాలో తోచక తన మేనత్త నాగమణికి విషయం చెప్పింది. దీంతో నాగమణి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై వెంకట్‌రెడ్డి కేసు నమోదు చేసుకొని రూరల్ సీఐ సురేందర్‌రెడ్డి విచారణ మొదలు పెట్టారు. పోలీసుల విచారణలో మహాన్వి శరీరంపై బలమైన గాయాలు ఉన్నాయి. నిందితుడు అరవింద్‌రెడ్డి పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.