వర్షాల కారణంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగొద్దు
ఎల్లవేళలా అప్రమత్తంగా వ్యవహరించాలి
నీరు నిలిచే ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
పురాత భవనాలను కూల్చివేస్తాం
జీహెచ్‌ఎంసీ సమీక్ష సమావేశంలో హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 12 (విజయక్రాంతి): వర్షాల కారణంగా గ్రేటర్ హైదరాబాద్‌లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా అధికారులు 24 గంటల పాటు అప్రమత్తంగా వ్యవహరించాలని హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. వర్షాల సమయంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ప్రజల రక్షణలో పార్టీలకు అతీతంగా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వాన కా లం నేపథ్యంలో ప్రిపరేషన్ యాక్షన్ ప్లాన్, శానిటేషన్, వెటర్నరీ, ఫుడ్ సేఫ్టీ, నాలాలు, యూబీడీ తదితర అంశాలపై జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్ రెడ్డి, ఇన్‌చార్జ్ కమిషనర్ ఆమ్రపాలి, ఇతర అధికారులతో కలిసి బుధవారం సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ.. వర్ష కాలం నేపథ్యంలో 203 మం ది నోడల్ అధికారులను నియమించామని, వరద నీరు నిలిచే 141 ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
నాలాల్లో పూడిక తీయడంతో పాటు గుర్తించిన వాటర్ లాగింగ్స్ పాయింట్స్ వద్ద ప్రత్యే క చర్యలు చేపడుతున్నామన్నారు. ప్రమాదాలు జరిగే నాలాల వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మాన్‌సూన్ ఎమర్జెన్సీ టీమ్స్, మొబైల్ ఎమర్జెన్సీ టీమ్స్‌ను ఏర్పాటు చేసి 24 గంటలు అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. జీహెచ్‌ఎంసీలో 12 చోట్ల వాటర్ స్టాగ్నేషన్ క్లియర్ చేయడం కోసం సంపుల నిర్మాణానికి ప్రతిపాదించినట్టు వివరించారు.
పురా తన భవనాలను, ప్రహరీలను కూల్చి వేయనున్నట్టు చెప్పారు. వర్షాలకు సంబంధించి కంట్రోల్ రూం ఏర్పాటు చేసి ప్రజలకు ముందస్తు సమాచారం అందిస్తున్నట్టు తెలిపారు. బక్రీదు పర్వదినం పురస్కరించుకొని తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ప్రమాదకరంగా ఉండే ట్రాన్స్‌ఫార్మర్లకు ఫెన్సింగ్ వేయాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు.
ఫుడ్ సేఫ్టీ విభాగానికి ప్రతి జోన్‌కు ఒక ప్రత్యేక వాహనం ఉండేలా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలన్నారు. కుక్కలతో ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూ చించారు. సమావేశంలో ఈఎన్‌సీ జియాఉద్దీన్, ఈవీడీఎం డైరెక్టర్ ఎన్ ప్రకాశ్ రెడ్డి, సీఈలు కోటేశ్వరరావు, దేవానంద్, జోనల్ కమిషనర్లు స్నేహ శబరీష్, అభిలాష అభినవ్, హేమంత్ సహదేవ్ రావు, రవి కిరణ్, వెంకన్న, అడిషనల్ కమిషనర్లు శ్రీవాత్సవ్ కోట, సత్యనారాయణ, ఉపేందర్ రెడ్డి, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు.






