22 July, 2026 | 2:01 AM

ఆ లేఖ పార్టీ అంతర్గత వ్యవహారం

22-07-2026 12:24 AM
  1. తప్పుడు ప్రచారం మానుకోవాలి
  2. బీజేపీ రాష్ట్రనేత దారం గురువారెడ్డి

గజ్వేల్, జూలై 21(విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన వివరణ కోరిన లేఖ పూర్తిగా పార్టీ అంతర్గత వ్యవహారమని, దానిని వక్రీకరించి తప్పుడు ప్రచారం చేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర నాయకుడు దారం గురువారెడ్డి స్పష్టం చేశారు. గజ్వేల్ బీజేపీ కార్యాలయంలో కుడిక్యాల రాములు, పవన్ నాగులపల్లి, అనంత్ సాయితో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గజ్వేల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేయడం,

కార్యకర్తలను రక్షించడం, ప్రజల్లో పార్టీని విస్తరించడమే లక్ష్యంగా నియోజకవర్గ కమిటీ ఏర్పాటు చేశామన్నారు. పార్టీకి వ్యతిరేకంగా తాము ఎప్పుడూ పనిచేయలేదని, పార్టీ నిర్ణయాలను పార్టీ అంతర్గత వేదికలపైనే చర్చించి పరిష్కరించుకుంటామన్నారు. రాష్ట్ర పార్టీ పంపిన లేఖను సరిగ్గా చదివించుకుని, అర్థం చేసుకుని మాట్లాడాలి. ఆ లేఖలో మమ్మల్ని సస్పెండ్ చేసినట్లు ఎక్కడా లేదు. అయినప్పటికీ మాపై వ్యక్తిగతంగా, రాజకీయంగా తప్పుడు ప్రచారం చేయడం బాధాకరమన్నారు.

పార్టీ అంతర్గత విషయాలను బయటకు తీసుకువచ్చి ప్రచారం చేయడం పార్టీ క్రమశిక్షణకు విరుద్ధం అని  అన్నారు. తమపై వ్యక్తిగత ఆరోపణలు, తప్పుడు ప్రచారం కొనసాగితే తాము కూడా వాస్తవాలను ప్రజల ముందుంచాల్సి వస్తుందని  హెచ్చరించారు. సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తన తీరు మార్చుకుని, పార్టీ ఐక్యత, బలోపేతం కోసం పనిచేయాలని హితవు పలికారు.

తమపై తప్పుడు వార్తలు ప్రచురించినా, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గురువా రెడ్డి స్పష్టం చేశారు.  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు, కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తదితర నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసం ఉందని నాయకులు తెలిపారు.  కుడిక్యాల రాములు, పవన్ నాగులపల్లి, అనంత్ సాయి తదితరులున్నారు.