calender_icon.png 12 January, 2026 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆదిలాబాద్ బంద్ సంపూర్ణం

07-01-2026 01:08:30 AM

  1. రంగు మారిన సోయా పంటను కొనాలని బంద్ చేపట్టిన బీఆర్‌ఎస్ 
  2. తెల్లవారుజాము నుంచే ఆర్టీసీ డిపో ఎదుట బైఠాయింపు
  3. అడ్డుకున్న పోలీసులు.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం
  4. మాజీ మంత్రి జోగు రామన్న అరెస్టు
  5. స్వచ్ఛందంగా బంద్ పాటించిన వ్యాపా,  వాణిజ్య సంస్థలు 

ఆదిలాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): రంగు మారిన సోయా పంటను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులకు మద్దతుగా మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన ఆదిలాబాద్ పట్టణ బంద్ సంపూర్ణంగా జరిగింది. పలువురు వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటించడంతో బంద్ విజయవంతం అయింది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న నేతృత్వంలో కొనసాగుతున్న దశలవారి రైతు పోరుబాటలో బాగంగా మంగళవారం చేపట్టిన బంద్‌లో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

ఉదయం ఆర్టీసీ బస్సులు బైటకు రాకుండా డిపో ఎదుట పార్టీ శ్రేణులతో కలిసి మాజీ మంత్రి బైఠాయించారు. దీంతో బస్సులన్ని డిపోకే పరిమితం అయ్యాయి. డీఎస్పీ జీవన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేశారు. మాజీ మంత్రి నిరసనను విరమించేందుకు ఒప్పుకోకపోవడంతో ఆయన్ని బలవంతంగా అరెస్టు చేస్తున్న క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది.

జోగు రామన్న, మాజీ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, ఇతర నేతలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం పట్టణ ప్రధాన వీధుల గుండా పలువురు పార్టీ శ్రేణులు బైక్‌లపై తిరుగుతూ తెరిచి ఉన్న దుకాణాలను మూసి వేయించారు. బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పట్టణంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జోగు రామన్న మాట్లాడుతూ.. నిబంధనలను తొలగించి, పండిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరతో కొనుగోలు చేయడంతో పాటు రైతుల ఇక్కట్లను దూరం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ రంగ సంస్థలైన నాఫెడ్, మార్క్ ఫెడ్ కొనుగోళ్లు చేయక రైతులు పడరాని పాట్లు పడుతుంటే ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాలు కనీసం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రంగు మారిన సోయా పంటను వెంటనే కొనుగోలు చేయాలని, లేనిపక్షంలో మరిన్ని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చి నిబంధనల సడలింపు చేయాల్సిన స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేల నుండి కనీస స్పందన లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.

విదేశాల దిగుమతులకు 11% సుంకం ఎత్తివేయడంతో  రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కేవలం రూ. 133 కోట్ల రూపాయలతో పంటలను కొనుగోలు చేయవచ్చని, అయినా చలనం లేని ప్రభుత్వం ముందుకు రాకపోవడం సిగ్గుచేటు అన్నారు. నేడు కిసాన్ కాపాస్ యాప్, యూరియా యాప్, వంటి నిబంధనలతో రైతాంగాన్ని ఇబ్బందుల్లో నెట్టుతుంది అన్నారు.

బిజెపి ఎమ్మెల్యేలు 8 మంది ఉన్న అలాగే బీజేపీ ఫ్లోర్ లీడర్ ఉన్నప్పటికీని అసెంబ్లీలో రైతు సమస్యలను పరిష్కరించేందుకు నిరసన తెలుపకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఈ ఆందోళనలో నాయకులు జోగు మహేందర్, యాసం నర్సింగరావు, అజయ్, ఇజ్జగిరి నారాయణ, మెట్టు ప్రహ్లాద్, యూనిస్ అబ్బనీ, గండ్రత్ రమేష్, సాజిత్ ఉద్దీన్, లింగారెడ్డి, సేవ్వా జగదీష్, గండ్రత్ రమేష్, కొండ గణేష్, దమ్మపాల్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.