వేసైడ్ మార్కెట్ వేస్టేనా?
వనపర్తి, మే 31(విజయక్రాంతి): రోడ్లపై కూరగాయల విక్రయాలకు పుల్‌స్టాప్ పెట్టాలనే లక్ష్యం నీరుగారిపోతోంది. 3.40కోట్లతో నిర్మించిన వేసైడ్ మార్కెట్ నిరుపయోగంగా మారింది. రాష్ట్రంలోనే రెండో వేసైడ్ మార్కెట్‌గా అప్పటి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చొరవతో కూరగాయల విత్తన తయారీ సంస్థ సింజెంటా సామాజిక బాధ్యతగా రూ.3.40 కోట్లతో వనపర్తిలోని పెబ్బేర్ రోడ్డులో వేసైడ్ మార్కెట్‌ను నిర్మించారు. 2023 మార్చి 2న ఎంతో అట్టహాసంగా ప్రారంభించారు. రైతులు, పట్టణవాసులతో ఆ రోజు సందడి నెలకొంది. ఇక అంతే ఆ తర్వాత అటువైపు వెళ్లేవారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతూ వచ్చి.. ఇప్పుడు అటువైపు కన్నెత్తి చూసే వారే కరువయ్యారు. ప్రధానంగా వ్యాపారులే అక్కడ బిజినెస్‌కు విముఖంగా ఉండడంతో వినియోగదారులు సైతం అటుగా వెళ్లడం లేదు. ప్రస్తుతం వ్యాపారులు మళ్లీ రోడ్ల మీదే కూరగాయలు విక్రయించడంతో ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది.
నిధుల లక్ష్యానికి సార్థకత దొరికేనా?
కార్పొరేట్ సంస్థల వార్షిక ఆదాయంలో సామాజిక బాధ్యతగా కొంత డబ్బును ప్రజోపకార కార్యక్రమాలకు వినియోగించాలని పరిశ్రమల శాఖ బైలాలో ఉంది. అప్పటి మంత్రి నిరంజన్‌రెడ్డి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ముందుచూపుతో సీఎస్‌ఆర్ ఫండ్‌ను సొంత జిల్లాలో వేసైడ్ మార్కెట్‌కు వెచ్చించారు. దీనిని రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకున్నప్పుడే సిజెంటా సంస్థ ఖర్చు చేసిన సామాజిక బాధ్యత నిధులకు సార్థకత ఏర్పడుతుంది.
మార్కెటింగ్ శాఖకు అప్పగించలేదు
సింజెంటా సంస్థ అన్ని రకాల సౌకర్యాలతో వేసైడ్ మార్కెట్ నిర్మించింది. కానీ, ఆ భవనాన్ని అధికారికంగా మార్కెటింగ్ శాఖకు అప్పగించలేదు. ఎన్నికల కోడ్ తరువాత ఏమైనా ఆదేశాలు వస్తే వాటికి అనుగుణంగా చర్యలు తీసుకుంటాం.
-స్వరణ్ సింగ్, మార్కెటింగ్ శాఖ అధికారి, వనపర్తి






