calender_icon.png 4 December, 2024 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో పేలేది ఆటంబాంబే!

08-11-2024 12:46:02 AM

ఎంత పెద్దవారైనా 

  1. చట్టానికి చుట్టం కాదు
  2. గుమ్మడికాయల దొంగలా కేటీఆర్ తీరు 
  3. 5౦ కోట్లు ఎటువెళ్లాయో బయట పడుతుంది
  4. తడిగుడ్డతో గొంతు కోసింది మీరు కాదా? 
  5. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

జనగామ, నవంబర్ 7(విజయక్రాంతి): దీపావళికి ముందు లక్ష్మీ బాంబులు పేలుతాయని తను చేసిన వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ నాయకులు ఉలిక్కిపడుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. మాజీ మంత్రి కేటీఆర్ గుమ్మడికాయల దొంగలా వ్యవహరిస్తున్నారని అన్నారు.

తప్పు చేయక పోతే ఉలికిపాటు ఎందుకు అని ప్రశ్నించారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని, కాకపోతే త్వరలో పేలేది నాటుబాంబు కాదు, లక్ష్మీబాంబు కాదు.. పేలేది ఆటం బాంబేనని పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేటీఆర్ పాదయాత్ర చేస్తారో.. మోకాళ్ల యాత్ర చేస్తారో చేసుకోవచ్చని, ఎంత పెద్దవారికైనా చట్టం చుట్టం కాదని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పరోక్షంగా కేటీఆర్‌కు హెచ్చరికలు చేశారు. గురువారం మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మార్కె ట్ యార్డులో నూతన పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మాయమాట లతో పదేళ్లు తెలంగాణను మీ కుటుంబం కొల్లగొట్టలేదా అని కేటీఆర్‌ను ప్రశ్నించారు. రూ.౫౦ కోట్లను ఎక్కడి నుంచి ఎక్కడికి తరలించారో బయటపడుతుందని అన్నారు. తాను అరెస్టుల గురించి మాట్లాడితే పొంగులేటి హోంమంత్రా అని కేటీఆర్ ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని, తాను క్యాబినెట్‌లో మంత్రిని అనే విషయం గుర్తుంచుకోవాలని హితవు పలికారు.

ఏ తప్పు చేయన ప్పుడు అరెస్టులపై కేసీఆర్ కుటుంబం ఎందుకు ఉలిక్కిపడుతుందో అర్థం కావడం లేదన్నారు. తాను ఎవరి పేరు ప్రస్తావించలేదని, కేటీఆర్ పరోక్షంగా తప్పును ఒప్పుకొంటున్నారని అన్నారు. తప్పు చేసినట్టు అనిపిస్తే దేవుడి ముందు క్షమాపణ చెప్పి కోర్టులో నేరం ఒప్పుకోవాలని సూచించారు.

తాను ఎవరి కాళ్లు మొక్కలేదని, తండ్రిలా భావించి కేసీఆర్ కాళ్లు మొక్కితే తనతోపాటు ఉమ్మడి ఖమ్మం ప్రజల గొంతును తడిగుడ్డతో కోశారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పారన్నారు. అభివృద్ధి విషయంలో తాము వెనక్కి తగ్గబోమని, త్వరలోనే మామునూరు విమానాశ్రయంలో విమానాలు దింపబోతున్నామని దీమా వ్యక్తంచేశారు. 

రుణమాఫీ ఆగదు..

ఎన్నికల్లో ఇచ్చిన హామీప్రకారం తలతాకట్టు పెట్టయినా తాము రుణమాఫీ చేసి తీరుతామని పొంగులేటి అన్నారు. ఇప్పటికే రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేశామని గుర్తు చేశారు. డిసెంబర్‌కల్లా సంపూర్ణంగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని మాటిచ్చారు. కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చి ప్రభుత్వ భూములను సంరక్షిస్తామన్నారు.

బీఆర్‌ఎస్ హయాంలో ఎన్నో భూములు ఆక్రమణకు గురయ్యాయని, వాటి సంరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు కడియం కావ్య, బలరాంనాయక్, ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, కాంగ్రెస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి ఝాన్సీరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

భూ ఆక్రమణదారులను వదిలేది లేదు

భూ ఆక్రమణలపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉపేక్షించబోదని, ప్రభుత్వ ఆస్తులను సంరక్షించడమే ధ్యేయంగా తాము పనిచేస్తున్నా మని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మిషన్ భగీరథ అతిథి గృహంలో మహబూబాబాద్, జనగామ జిల్లాల కలెక్టర్లు అద్వైత్ కుమార్‌సింగ్, షేక్ రిజ్వాన్ బాషాతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు.

భూ ఆక్రమణదారులను గుర్తించి వెంటనే నోటీసులు అందించి చర్యలు తీసుకోవాలని కలెక్ట ర్లను ఆదేశించారు. డబుల్ బెడ్‌రూం నిర్మాణాలు ఎన్ని పూర్తయ్యాయో గుర్తించి.. వాటి పంపిణీకి చర్యలు చేపట్టాలన్నారు. ఇంకెన్ని డబుల్ బెడ్‌రూం ఇండ్లు అవసరమో ప్రతిపాదనలు పంపాలన్నారు.

ప్రభుత్వం సన్న, దొడ్డు రకాలకు ధాన్యం కొనుగోలు కేంద్రా లు ఏర్పాటు చేసిందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు త్వరగా మంజూరుచేయాలని ఆదేశించారు. పాలకుర్తి పరిధిలోని ఇరిగేషన్ రిజర్వాయర్లు, కెనాళ్ల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు.

మహబూబాబాద్, జనగామ జిల్లాల పరిధిలో ఇంటిగ్రేటెడ్ ఉన్నత పాఠశాలల మంజూరు, సీసీ రోడ్ల నిర్మాణానికి నివేదిక సిద్ధం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, మహబూబాబాద్ ఎంపీ బలరాంనాయక్, ప్రభుత్వ విప్ జాటోతు రామచంద్రనాయక్, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి పాల్గొన్నారు.

నన్ను జైల్లో పెడితే యోగా చేస్తా..

ఇష్టంవచ్చిన కేసు పెట్టుకో..

  1. బయటకు వచ్చాక పాదయాత్ర చేస్తా
  2. ఎలక్ట్రికల్ వాహనాల ప్రమోషన్
  3. కోసం ఫార్ములా వన్ రేస్
  4. హెచ్‌ఎండీఏ నుంచి రూ.55 కోట్లు వినియోగించాం.. దాని బాధ్యత నాదే
  5. దమ్ముంటే మేఘా కృష్ణారెడ్డిని అరెస్టు చేయాలి: బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

హైదరాబాద్, నవంబర్ 7 (విజయక్రాంతి): ‘జైల్లో పెట్టి రేవంత్‌రెడ్డి పైశాచిక ఆనందం పొందుతానంటే అందుకు ఎప్పుడైనా సరే.. జైలుకు వెళ్లడానికి నేను సిద్ధం. రెండు మూడు నెలలు జైల్లో ఉంటే ఏమీకాదు అని మంచిగా యోగా చేసుకుని బయటకు వచ్చి, తరువాత రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తా’ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు సంచలన వ్యాఖ్యలు చేశారు.

గురువారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మీరు టార్గెట్ చేయాల్సింది కేటీఆర్‌ను కాదని, ప్రజా సమస్యలపై దృష్టిపెట్టాలని ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఈ-కారు రేసింగ్ విషయంలో ఏసీబీ నుంచి తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. రేవంత్ ఉడుత ఊపులకు భయపడే ప్రసక్తిలేదని తెలిపారు.

రాజ్‌భవన్ వేదికగా కాంగ్రెస్, బీజేపీ ఒక్కటైనట్లు బయటపడిందని, వారు బీర్‌ఎస్‌ను ఖతంచేయాలని కుట్రలుచేస్తున్నారని ఆరోపించారు. ఫార్ము లా వన్ రేస్‌ను నిర్వహించేందుకు అనేక దేశాలు పోటీపడతాయని, దేశానికి ఫార్ము లా వన్ రేసు రావాలన్న కల ఈనాటిది కాదని.. రేవంత్ రెడ్డి గురువు చంద్రబాబు 2003లో ఎఫ్1 రేసు హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్రయత్నం చేశారన్నారు. ఆయ న గురువు చేయని పనిని తాము చేశామని తెలిపారు. 

ఎలక్ట్రిక్ కార్ల ప్రమోషన్‌కోసమే..

ఫార్ములా రేసింగ్‌ను మేము ఒక రేసింగ్‌గా మాత్రమే చూడలేదని, ఎలక్ట్రిక్ కార్లను ప్రమోట్ చేయాలనుకున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు హైదరాబాద్‌ను అడ్డాగా మార్చాలని ప్రయత్నం చేశామని, మహీం ద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను కూడా ఈ-రేస్‌కు సంబంధించిన కమిటీలో మెంబర్‌గా చేశామని.. తెలంగాణ, హైదరాబాద్ బ్రాండ్ పెంచేందుకు ఎలక్ట్రిక్ మ్యాను ఫాక్చరింగ్ చేద్దామనుకున్నట్లు తెలిపారు.

మొదటిసారి ఈ--రేస్ నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు చేసిన ఖర్చు రూ. 40 కోట్లు మాత్రమేనని, హైదరాబాద్‌కు వచ్చిన ప్రయోజనం రూ. 700 కోట్లు అని నీల్సన్ అనే సంస్థ కూడా చెప్పిందన్నారు. అదే కాకుండా అమర్‌రాజా బ్యాటరీస్, హ్యుందా య్ అనే సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయని, బ్యాటరీ వెహికిల్స్ రీ పర్ప స్ చేసే విధంగా జీవో తెచ్చినట్లు చెప్పారు. మరో సంస్థ రూ. 12 వందల కోట్లు పెట్టుబడులు పెట్టిందన్నారు. ఫార్ములా ఈ- మొబిలిటీ వీక్ అనే కార్యక్రమం ద్వారా దాదాపు రూ. 2,500 కోట్లు పెట్టుబడులు తెచ్చామన్నారు. 

నాలుగేళ్ల క్రితమే త్రైపాక్షిక ఒప్పందం

ఈ కోసం నాలుగేళ్ల కితం త్రైపాక్షిక ఒప్పందం చేసుకున్నామని, నిర్వహణ సంస్థ.. హెచ్‌ఎండీఏ, గ్రీన్ కో అనే మూడు సంస్థలతో ఒప్పందం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వానికి లాభం వచ్చినప్పటికీ గ్రీన్ కో అనే సంస్థ మాత్రం తమకు లాభం రాలేదని పక్కకు తప్పుకుందని, గత ఏడాది 2023లో ఈ--రేస్ పోకుండా ఆ డబ్బులను తామే ఇద్దామని అర్వింద్‌కు చెప్పినట్లు వెల్లడించారు.

వాళ్లకు స్పాన్సర్లు దొరకకపోవ టంతో ప్రమోటర్ దొరికే వరకు నేనే భరోసా ఉంటానని, ప్రభుత్వం తరఫున ఆ డబ్బు ఇద్దామని చెప్పానన్నారు. హెచ్‌ఎండీఏకు తెలియకుండా మేము డబ్బులు ఇచ్చామని అంటున్నారని, కానీ ఈ విషయం హెచ్‌ఎండీఏకు పూర్తిగా తెలుసునన్నారు. ఈ- ప్రభుత్వ కార్యక్రమంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచేందుకు రూ. 55 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. 

అర్వింద్‌కుమార్ ఎలాంటి తప్పు చేయలేదు

అర్వింద్ కుమార్ ఎలాంటి తప్పు చేయలేదని, ఈ మొత్తానికి తాను బాధ్యత తీసు కుంటానని కేటీఆర్ అన్నారు. పురపాలక శాఖలో జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ అంతర్గతంగా డబ్బులు సర్దుబాటు చేసుకొనే అవకాశం ఉంటుందన్నారు. దీనికి కేబినెట్ అనుమతి అవసరం లేదని అన్నారు. ఈ- కారణంగా 49 దేశాల్లో హైదరాబాద్ పేరు తెలిసేలా చేశామని, ఎన్నో పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేశామన్నారు.

సీఎం రేవంత్‌కు  కూలగొట్టుడు, విధ్వంసం చేయటమే తెలిసిన పని అని, నిర్మాణం చేయటం తెలియదన్నారు. అందుకే సీఎంగా ఎన్నికైన వెంటనే ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ రద్దు అంటూ ప్రకటనలు చేసి, మాపై కోపంతో అందులో నాకేదో వచ్చిందనుకొని ఏమీ తెలుసుకోకుండా రద్దు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి దిక్కుమాలిన నిర్ణయంతో ప్రపంచం ముందు హైదరాబాద్ పరువుపోయి ఈ-రేసింగ్ నిర్వహించకపోవడం వల్ల రూ.700 కోట్లు నష్టపోయామన్నారు. ఏసీబీ ఫుల్‌ఫామ్ రేవంత్ రెడ్డికి తెలియదని అన్నారు. 

సీఎంకు దమ్ముంటే మేఘా కృష్ణారెడ్డిపై కేసు పెట్టాలి

నిజానికి కేసు పెట్టాలంటే మేఘా కంపెనీ మీద పెట్టాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కృష్ణారెడ్డి మీద ఏసీబీ కేసు పెట్టే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని నిలదీశారు. రాఘవ, మేఘా కంపెనీలకు కేకులు కట్‌చేసి ఇచ్చినట్లు ఇచ్చిన పనులకు సంబంధించి వాటిపై కేసులు నమోదు చేయాలన్నారు.

రూ. 50 లక్షల బ్యాగుతో దొరికిన రేవంత్‌పై 8 ఏళ్లుగా ఎలాంటి చర్యలు లేవని, బీఆర్‌ఎస్ పాలనలో బ్రాండ్ ఇమేజ్‌ను క్రియేట్ చేస్తే రేవంత్ చెడ్డ పేరు తెస్తున్నారని మండిపడ్డారు. విశ్వనగరం ఇమేజ్ లేకుండా చేస్తే పెట్టుబడులు రావన్నారు. 

తనపై కేసులు పెట్టేది హైదరాబాద్‌కు అంతర్జాతీయంగా పేరు తెచ్చినందుకా, లక్షల కోట్లు పెట్టుబడులకా, బెంగళూరు కన్నా ఐటీ ఎగుమతులను తీసుకొచ్చినందుకా, యువతకు ఉపాధి మార్గం చూపించినందుకా ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. ఆరు గ్యారెంటీలు అమలు చేయకుండా తప్పించుకునేందుకు రేవంత్ తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.