భవిత సెంటర్ ను మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దాలి: మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): భవిత సెంటర్ ను మోడల్ కేంద్రంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komatireddy Venkata Reddy) సూచించారు. జిల్లా కేంద్రంలో కోమటి రెడ్డి ప్రతీక్ ఫౌండేషన్(Komatireddy Prateek Foundation) ఆధ్వర్యంలో పునర్నిర్మించిన భవిత సెంటర్‌ను గురువారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటించిన మంత్రి, మరింత సౌకర్యాలు అవసరమైతే ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా అందజేస్తామని హామీ ఇచ్చారు. స్పీచ్ థెరపీ సౌకర్యానికి కూడా అంగీకారం తెలిపారు. ఇప్పటికే ఫౌండేషన్ తరఫున రూ.10 లక్షలు, కలెక్టర్ నిధుల ద్వారా రూ.7 లక్షలతో అభివృద్ధి పనులు జరిగాయి. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎస్పీ శరత్చంద్ర పవార్, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.






