7 July, 2026 | 2:22 AM

అయోధ్య అవినీతి ఆరోపణలపై బీజేపీ స్పందించాలి

07-07-2026 12:00 AM

మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, జూలై 6: అయోధ్య శ్రీరామ మందిరం పేరుతో దేశవ్యాప్తంగా విరాళాలు సేకరించి రాజకీయ ప్రయోజనాలు పొందిన భారతీయ జనతా పార్టీ, ప్రస్తుతం ఆలయ నిర్మాణానికి సంబంధించి వెలుగులోకి వస్తున్న ఆరోపణలపై ప్రజలకు స్పష్టమైన వివరణ ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.

సోమవారం జిల్లెలగడ్డలో విలేకరులతో మాట్లాడిన ఆయన, శ్రీరామ మందిర నిర్మాణానికి సంబంధించిన నిధుల వినియోగం, అవినీతి ఆరోపణలపై బీజేపీ తన వైఖరిని వెల్లడించాలని అన్నారు. ఆరోపణల్లో నిజానిజాలు ప్రజలకు తెలియజేయడంతో పాటు, తప్పులు జరిగి ఉంటే దేశ ప్రజలకు, భక్తులకు క్షమాపణ చెప్పాలని సూచించారు. రాముడి పేరును రాజకీయ లబ్ధి కోసం ఉపయోగించారని ఆరోపించిన మంత్రి, అయోధ్య ప్రజలే ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

పవిత్రమైన రామజన్మభూమికి సంబంధించిన అంశాల్లో అవినీతి, అక్రమాల ఆరోపణలు రావడం హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తోందని అన్నారు. ఈ వ్యవహారంపై దేశంలోని మత పెద్దలు, హిందూ సంస్థలు కూడా స్పందించాలని కోరారు. ఎన్నికల సమయంలో ‘జై శ్రీరామ్‘ నినాదాలతో ఓట్లు కోరిన బీజేపీ, ఇప్పుడు అదే శ్రీరాముడి ఆలయానికి సంబంధించిన వివాదాలపై మౌనం వీడాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై కూడా విమర్శలు చేసిన ఆయన, మతాన్ని రాజకీయాలకు వినియోగించడం కాంగ్రెస్ పార్టీ విధానం కాదని వ్యాఖ్యానించారు.