7 March, 2026 | 4:19 PM

Breaking News

బి.ఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలి   •   సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ కె. హైమావతి   •   సోషల్ మీడియాలో ప్రధానిపై పోస్ట్.. వ్యక్తిపై కేసు నమోదు   •   వెంకటేష్ కుటుంబాన్ని పరామర్శించిన బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్   •   తాళాలకే పరిమితమైన యోగ కేంద్రం   •   రైతు భరోసా కోసం నిరసన   •   ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు పాల్గొనాలి   •   వేం నరేందర్ రెడ్డిని సన్మానించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి   •   అల్లాడిపోతున్న జనం.. 40 డిగ్రీలు దాటిన గరిష్ట ఉష్ణోగ్రతలు   •   ఎల్‌పీజీ ధరల పెంపు.. నిరసనకు మమత పిలుపు   •  

బంధం మళ్లీ పటిష్టం!

06-03-2026 12:00 AM

ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్త దాడులు చేస్తుండడం, ప్రతిగా ఇరాన్ కూడా ధీటుగా స్పందిస్తుండడంతో పశ్చిమాసియా సహా ప్రపంచమంతా అస్థిర వాతావరణం నెలకొన్నది. ఈ సమయంలో భారత్, కెనడాలు తమ సంబంధాలు మెరుగుపరుచుకోవడం స్వాగతించాల్సిన పరిణామం. కెనడా ప్రధాని మార్క్ కార్నీ మన దేశంలో నాలుగు రోజులు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలకమైన ఒప్పందాలు కుదిరాయి.

2030 నాటికి ద్వుపాక్షిక వాణిజ్యం రూ.4.65 లక్షల కోట్లకు చేరుకు నేలా ఇరుదేశాలూ కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నాయి. అణు విద్యుదుత్పాదన కోసం ఇప్పుడు సరఫరా చేస్తున్న యురేనియంను మరింత పెంచేం దుకు కెనడా అంగీకరించడం ముదావహం. పదేళ్లపాటు యురేనియం ఎగుమతికి కెనడాతో ఒప్పందం జరగడం మంచి విషయం. కృత్రిమ మేధ (ఏఐ), ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, ఆవిష్కరణల విషయంలో ఇరుదేశాల్లోని విశ్వవిద్యాలయాలు భాగస్వామ్యాలను కుదుర్చుకోవడం ఆర్థిక రంగంలో వృద్ధికి దారి తీసే అవకాశముంది.

విద్యుత్, టెక్నాలజీ రంగాల్లో పరస్పరం సహకరించుకోవడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అయితే ఖలిస్తానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు 2023లో హతమార్చాక భారత్, కెనడాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో సిక్కుల ఓటు బ్యాంకు కోసం వేర్పాటువాదులను ప్రోత్సహించడం, భారత్‌లో నేరాలు చేసి వచ్చిన వ్యక్తులను అప్పగించేందుకు ట్రూడో ప్రభుత్వం నిరాకరించడం వంటి చర్యలు మనతో బంధాన్ని మరింత దూరం చేశాయని చెప్పొచ్చు.

అయితే వేర్పాటువాదులను ఆదరిస్తే ఫలితం ఎలా ఉంటుందో ట్రూడోకు గతేడాది ఏప్రిల్‌లో జరిగిన ఎన్నికలకు ముందే తెలిసొచ్చింది. ట్రూడో కొనసాగితే లిబరల్ పార్టీ ఓడిపోతుందని సర్వేలు తేల్చడంతో ఆయన రాజీనామా చేయక తప్పలేదు. అనంతరం వచ్చిన మార్క్ కార్నీ స్వల్ప కాలంలోనే సమర్థ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. గతేడాది కెనడాలో జరిగిన జీ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరైన తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు మళ్లీ చిగురించడం మొదలైంది.

అంతేకాదు ట్రూడో తర్వాత కార్నీ అధికారంలోకి రాగానే భారత అనుకూల విధానాలకు పెద్దపేట వేశారు. ఇరు దేశాల హైకమిషనర్ల నియామకం, రెండు దేశాల మధ్య వివిధ మంత్రిత్వ శాఖల్లో సయన్వయం కోసం పరస్పరం కృషి చేశాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కెనడాను 51వ రాష్ట్రంగా విలీనం చేసుకుంటామనడంతో పాటు ఏకపక్ష సుంకాలు విధించడంతో ఆర్థికంగా దెబ్బతింటూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే తమ వాణిజ్యాన్ని విస్తరించుకోవాలని కెనడా కొత్త మిత్రులను వెతుక్కునే పనిలో పడింది.

ఈ క్రమంలో భారత్‌తో బంధాన్ని పటిష్టం చేసుకునేందుకు కార్నీ మన దేశానికి రావడం, కీలక ఒప్పందాలు జరగడం శుభపరిణామం. ఉగ్రవాదం మానవ జాతికి పెను సవాల్ గా తయారైందనీ, దీనిని అరికట్టేందుకు ఇరుదేశాలు సమష్టిగా పనిచేయాలని నిర్ణయించడం శుభపరిణామం. ఇందుకు తీర ప్రాంతాల్లో భద్రతా విషయంలో పరస్పరం సహకరించుకోవాలనే నిర్ణయానికి వచ్చాయి. అయితే భారత్, కెనడాల మధ్య అపోహలు ఇంకా పూర్తిస్థాయిలో తొలగిపోలేదు. కానీ కార్నీ పర్యటనతో రెండు దేశాలు కలిసి నడిస్తే స్నేహసంబంధాలు మరింత మెరుగవుతాయనడంలో సందేహం లేదు.