calender_icon.png 21 January, 2026 | 4:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌దే బొగ్గుస్కాం!

21-01-2026 01:27:37 AM

  1. నైనీ బొగ్గు బ్లాక్ వ్యవహారంలో సమగ్ర విచారణ జరిపించాలి
  2. రెండు పార్టీలూ సింగరేణి కార్మికుల రక్తాన్ని పీల్చాయి
  3. కిషన్‌రెడ్డికి లేఖ రాసే అర్హత బీఆర్‌ఎస్ నాయకులకు లేదు
  4. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు

హైదరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): సింగరేణి నైనీ బ్లాక్ వ్యవహా రంలో పాపం సగం బీఆర్‌ఎస్‌ది, సగం కాంగ్రెస్‌దేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ఆరోపించారు. కోల్ టెండర్లలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిన అవినీతిపై సమగ్ర దర్యా ప్తు జరిపి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు ఢిల్లీలో మీడియాతో మాట్లా డారు.

హరీశ్‌రావు బీఆర్‌ఎస్ పార్టీని సుద్దపూసలా చూపించే ప్రయత్నం చేస్తున్నారని, కానీ ఈ రాష్ట్రాన్ని మొదట భ్రష్టు పట్టించింది.. ఆ పార్టీయేనని, ఆ పాపా న్ని కొనసాగిస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని, ఈ రెండు పార్టీలు పాపాత్ములేనన్నారు. బీఆర్‌ఎస్, -కాంగ్రెస్ రెండు పార్టీలూ సింగరేణి కా ర్మికుల రక్తాన్ని పీల్చాయని  విమర్శించారు.  

నైని టెండర్లు ఎందుకు రద్దు చేశారు?

నైని బ్లాక్ టెండర్లు ఎందుకు ఇచ్చారు? ఎందుకు రద్దు చేశారు? ఎవరికి ఎంత ముడుపులు ముట్టాయి? ఈ విషయాలన్నింటిపై తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం, డిప్యూటీ సీఎం స్పష్టత ఇవ్వాలని  డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి సిట్ ఉంది, విజిలెన్స్ ఉందని, కేంద్రంలో సీబీఐ, ఈడీ ఉన్నాయని, ఏ సంస్థ దర్యాప్తు చేసినా సరే, దర్యాప్తు బీఆర్‌ఎస్ ప్రభుత్వ కాలం నుంచే ప్రారంభం కావాలన్నారు.

సింగరేణి -నైని బ్లాక్ టెండర్ల రద్దు వ్యవహారం కమీషన్లు కాంట్రాక్టుల పేరుతో కాంగ్రెస్ దోపిడీ పాలనకు నిదర్శనమన్నారు. నైని బ్లాక్ కేసు ద్వారా కాంగ్రెస్ పాలనలో టెండర్లు అభివృద్ధి కోసం కాకుండా కేవలం కమీషన్ల కోసమే జరుగుతున్నాయన్న నిజం బయటపడిందన్నారు. బీఆర్‌ఎస్ నేతలు  కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి లేఖ రాసే నైతిక హక్కు వారికి లేదన్నారు. 

సీబీఐ రాకుండా బీఆర్‌ఎస్ జీవో తీసుకొచ్చింది 

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై విచారణ జరగకుండా,  సీబీఐ తెలంగాణలోకి రాకుండా జీఓ తీసుకొచ్చిందని ఆయన చెప్పారు. సీబీఐ దర్యాప్తు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వ అనుమతి లేదా కోర్టు ఆదేశం అవసరమని, కానీ, ఈడీ విషయంలో అలా కాదు... ఆ సంస్థ అనేక కేసుల్లో దర్యాప్తు చేసి, కేసులు కూడా నమోదు చేసిందని తెలిపారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, కోల్ స్కామ్ - ఇవన్నీ సెలెక్టివ్ అంశాల్లో మాత్రమే కాకుండా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరగాలన్నారు. 

బీఆర్‌ఎస్ హయాంలో ఉద్యోగులు తగ్గారు

ఒకప్పుడు సింగరేణిలో వేలాది మంది ఉద్యోగులు ఉండగా, బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల సంఖ్య 42 వేలకు తగ్గిందని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది 38 వేలకే పరిమితమైందన్నారు. కార్మికుల రక్తం, చెమటతో లాభాల్లో నడిచిన సింగరేణిని పక్కన పెట్టి, ఈరోజు అదే సంస్థ పేరుతో వ్యాపారం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు.

దేశంలోనే అత్యంత లాభాల్లో ఉన్న సంస్థగా గుర్తింపు పొందిన సింగరేణిని ఈరోజు నష్టాల్లో ఉందని చెప్పడం దారుణమన్నారు.  నష్టాల్లో ఉందని చెబుతున్న సింగరేణి నుంచి మెస్సీ తెలంగాణకు వచ్చిన సందర్భంలో రూ.10 కోట్ల స్పాన్సర్షిప్ ఎలా ఇచ్చారు? లాస్‌లో ఉన్న సంస్థతో ఇంత భారీ ఖర్చులు ఎలా పెట్టారు? దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పాలని నిలదీశారు. . ‘సైట్ విజిట్’ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చి, ఆ విధానం పేరుతో అక్కడికి వెళ్లి తమకు సంబంధించిన వారికే టెండర్లు ఇవ్వాలనే కుట్రపూరిత నిర్ణయాలు తీసుకుంటోందని, ఇది పూర్తిగా ప్లాన్డ్ స్కామ్ అని ఆరోపించారు.  

టీవీ ఛానళ్ల గొడవ కాదు 

ఇది టీవీ ఛానళ్ల మధ్య గొడవ కాదని, ఇది కాంగ్రెస్‌లోని మంత్రుల మధ్య, గ్రూపుల మధ్య జరుగుతున్న గొడవ... తుపాకీ పెట్టి కార్పొరేట్ కంపెనీలను బెదిరించడం, పేపర్లలో వార్తలు రాగానే టెండర్లు క్యాన్సిల్ చేయడం.. ఇవన్నీ పారదర్శకత లేనదనడానికి నిదర్శనాలన్నారు. భారతీయ జనతా పార్టీలోని ఒక వర్గం బీఆర్‌ఎస్‌కు, మరో వర్గం కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తుందన్న ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు.

ఇది కాంగ్రెస్, -బీఆర్‌ఎస్ సృష్టించిన కథనం మాత్రమేనని, బీజేపీ ఒక టీమ్...ఐక్యంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. దర్యాప్తు సంస్థలపై మాకు ఎలాంటి నియంత్రణ లేదని, తాము కేవలం డిమాండ్ చేస్తామని, రెండు సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ విచారణ సాగుతూనే ఉందని, అధికారులను మాత్రమే బలి చేసి, రాజకీయ నాయకులను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అనే ప్రశ్నకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి సమాధానం రావాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.