05-08-2025 12:26:52 AM
-‘ఇందిరా భవన్‘ గా నామకరణం
-రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
-ఫోన్ ద్వారా మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్ రెడ్డి
నల్లగొండ టౌన్ ఆగస్టు 4 (విజయ క్రాంతి) : ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఒక్కరిదే కాదని అందరిదని,5 బెడ్ రూములు, వీడియో కాన్ఫరెన్స్ హాల్, స్టాఫ్ క్వార్టర్స్, సెక్యూరిటీ గదులతో అత్యంత అదనాతన సౌకర్యాలతో నల్గొండ పట్టణం నడిబొడ్డున నిర్మించిన నల్గొండ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం, మినిస్టర్ బంగ్లా కు ‘ఇందిరా భవన్‘ అని పేరు పెడుతున్నట్లు రాష్ట్ర రోడ్డు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు.
జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్లో 13 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సోమవారం అయన ప్రారంభించారు. పూజ కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ అంద రికీ అందుబాటులో ఉండే విధంగా క్లాక్ టవర్ సెంటర్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని నిర్మించామని, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే ఒక్కడిదే కాదని అందరిదని ,రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు నల్గొండకు వచ్చినప్పుడు వసతి ఉండే విధంగా క్యాంపు కార్యాలయాన్ని నిర్మించామని తెలిపారు. అందుకే ఈ కార్యాలయానికి ‘ఇందిర భవన్‘ అని నామకరణం చేసినట్లు వెల్లడించారు.
నల్గొండ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా నడుస్తున్నాయని, అంతేకాక ఆయా నియోజకవర్గాలలో కొత్త పనులు మంజూరయ్యాయని తెలిపారు. నకిరేకల్ నియోజకవర్గంలో తహసిల్దార్, ఎంపీడీవో ,పోలీస్ స్టేషన్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలకు 20 కోట్ల రూపాయలను మంజూరు చేస్తూ మంత్రి క్యాంప్ కార్యాలయంలో మొదటి ఫైల్ పై సంతకం పెట్టారు. అలాగే నకిరేకల్ వంద పడకల ఆసుపత్రిని నవంబర్లో ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ఇరిగేషన్ శాఖ ద్వారా బ్రాహ్మణ వెల్లేములకు నీటిని నింపినట్లే నార్కెట్పల్లి పెద్ద చెరువును కూడా నీటితో నింపి పూర్వ వైభవం తీసుకువచ్చి, కట్టను పట్టిష్టపరచడమే కాక ,పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు 15 రోజుల్లో టెండర్లు పిలిచి పనులు చేపట్టనున్నామన్నారు.
కోటి 20 లక్షల రూపాయలతో నిర్మించనున్న బ్రాహ్మణవెల్లేముల గ్రామపంచాయతీ భవనం దక్షిణ భారతదేశంలోనే ఆదర్శంగా ఉండేలా కట్టనున్నామని వెల్లడించారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో చింతపల్లి, నందిపాడు 2 బ్రిడ్జిలను హామ్ విధానంలో చేపట్టనున్నామని, పది రోజుల్లో పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ప్రధాన రహదారి నుండి వై టి పి ఎస్ కు వెళ్లే రహదారి నిర్మాణానికి 260 కోట్ల రూపాయలతో టెండర్లు పూర్తి అయ్యాయని, భూసేకరణకు సంబంధించి 31 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేసినట్లు మంత్రి వెల్లడించారు. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ఎల్బీ నగర్ నుంచి హయత్నగర్ వరకు డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ రోడ్డు ను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని, కింది భాగంలో సర్వీస్ రోడ్, మధ్యలో ఎన్హెచ్-65 మార్గం అనుసంధానమవుతుందని, దానిపైన మెట్రో రైలు మార్గం ఉంటుందన్నారు.
ఈ విషయంపై ఈనెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసి ఎలివేటెడ్ కారిడార్ కి సంబంధించి ప్రతిపాదనలతో పాటు, ఎన్ హెచ్ 65 ను 8 లైన్లలో విస్తరించడానికి డీపీఆర్ కూడా సిద్ధం చేశామన్నారు.విజయవాడ-హైదరాబాద్ మధ్య గ్రీన్ ఫీల్ ఎక్స్ప్రెస్ హైవే ని కూడా నల్గొండ మధ్యలో పోయే విధంగా మంత్రి నితిన్ గడ్కరీతో చర్చిస్తామన్నారు.నల్గొండ జిల్లా ప్రభుత్వ ప్రధానాస్పత్రిలో నెలకు 750 ప్రసవాలు అవుతున్నాయని, ఉస్మానియా తర్వాత ఇదే అతి పెద్ద ఆసుపత్రి అని అన్నారు. తిప్పర్తి, కనగల్ ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను 30 పడకల ఆసుపత్రులుగా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు.
నల్గొండలో 200 కోట్ల రూపాయలతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామని, డిండి ఎత్తిపోతల పథకానికి టెండర్ ప్రక్రియ పూర్తయిందని, వచ్చే క్యాబినెట్లో ఏ ఎంఆర్ పి లైనింగ్ పనులకు జీవో వచ్చే విధంగా చూస్తామని, సంవత్సర కాలంలో లైనింగ్ పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. 1000 కోట్ల రూపాయల వ్యయంతో త్వరలోనే గంధ మల్ల పనులు చేపట్టనున్నమని చెప్పారు. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఎం ఫార్మసీ ,ఎల్‌ఎల్ బి కోర్సులకు అన్ని ఏర్పాటు చేస్తున్నామని,వచ్చే వారం మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఎల్‌ఎల్ బి,ఎం ఫార్మసీ భవనాల నిర్మాణానికి టెండర్లు ఇచ్చే విధంగా వచ్చే క్యాబినెట్లో అనుమతి తీసుకుంటామని తెలిపారు.
నల్గొండ పట్టణంలో లతీఫ్ సాబ్ దర్గా , బ్రహ్మంగారి మఠం పైకి వెళ్లేందుకు మంజూరు చేసిన ఘాట్ రోడ్ పనులు నడుస్తున్నాయని, రోప్ వే కూడా మంజూరైనట్లు మంత్రి తెలిపారు.శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను వచ్చే మూడు సంవత్సరాల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికతో ముందుకెళ్తున్నామని తెలిపారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో గుర్రంపోడు బ్రిడ్జిని అత్యంత ప్రాధాన్యత క్రమంలో తీసుకుని పూర్తి చేసేందుకు మంజూరు చేయాలని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రికి విజ్ఞప్తి చేశారు.
అలాగే నల్గొండ మీదుగా గ్రీన్ఫీల్ రహదారి కార్నర్ నుండి కాకుండా నల్గొండ మధ్యలో వెళ్లేలా చూడాలని కోరారు. బ్రాహ్మణ వెల్లేముల ,ఉడుమర్లవద్ద ఆర్వో బీసీలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలోనకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయ వీర్ రెడ్డి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి, ఎస్పీ శరత్ చంద్ర పవార్, గ్రంథాలయ సంస్థ జిల్లా అధ్యక్షులు ఆఫీస్ ఖాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
నల్గొండను విద్యా హబ్ గా తీర్చిదిద్దుతా
నల్లగొండ టౌన్, జూలై 4 : నల్గొండ జిల్లాను విద్యా హబ్ గా తీర్చిదిద్దుతానని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఉత్తమమైన చదువులను అందించాలన్న లక్ష్యంతో నల్గొండ జిల్లా కేంద్రంలో చేపట్టిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల రాష్ట్రంలోనే మొదటిది కావాలన్నారు. 9 నెలల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆయన ఆదేశించారు.
సోమవారం నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని గంధం వారి గూడెంలో 200 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటె డ్ రెసిడెన్షియల్ పాఠశాల పనులకు మంత్రి భూమి పూజ నిర్వహించారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ తో పోటీపడి ఈ పాఠశాల నిర్మాణాన్ని అంతకన్నా బాగా తీర్చిదిద్దాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగార్జునసాగర్ శాసనసభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి,టి జి ఈ డబ్ల్యు ఎం ఐ డి సి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బాల ప్రసాద్, అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, నారాయణ అమిత్, నల్గొండ ఆర్డీవో అశోక్ రెడ్డి, విద్యాశాఖ అధికారి బిక్షపతి, టి జి ఈ డబ్ల్యు ఐ డి సి డి ఈ శైలజ,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.