05-08-2025 12:26:38 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, ఆగస్టు 4 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి రాష్ర్ట ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి రాజీ ఉండదని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. సోమవారం నియోజకవర్గ పరిధిలోని షేక్‌పేట, యూసఫ్‌గూడ డివిజన్లలో మేయర్ గద్వాల విజయలక్ష్మితో కలిసి సుమారు రూ.2.60 కోట్లకు పైగా నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
వార్డుల్లో సమస్యలపై అధికారులు తక్షణం స్పందించాలని, పనుల్లో నాణ్యత పాటించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి వద్దే మున్సిపల్ శాఖ ఉండటంతో హైదరాబాద్‌ను గొప్ప విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. ట్రిపుల్ ఆర్, మెట్రో, మూసీ ప్రక్షాళన వంటి బృహత్తర ప్రణాళికలతో నగరాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు.
కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ.. స్థానిక ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించడమే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. వార్డులో ఏ సమస్య వచ్చినా అధికారులు, కార్పొరేటర్లు వెంటనే స్పందించాలి అని ఆదేశించారు. మేయర్ గద్వాల విజయలక్ష్మి మాట్లాడుతూ.. గ్రేటర్ హైదరాబాద్‌లో మౌలిక సదుపాయాల పెంపునకు ప్రభుత్వం అనేక పనులు చేపట్టిందన్నారు.
కార్పొరేటర్లు తమ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనుల ప్రతిపాదనలను తన దృష్టికి గానీ, ఇన్‌చార్జి మంత్రి దృష్టికి గానీ తీసుకువస్తే వెంటనే మంజూరు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెఎంసీ కమిషనర్ కర్ణన్, కలెక్టర్ హరిచందన దాసరి, జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, నియోజకవర్గ ఇన్‌చార్జి మహమ్మద్ అజారుద్దీన్, కార్పొరేటర్లు రాషత్ ఫరాజుద్దీన్, సీఎన్ రెడ్డి పాల్గొన్నారు.