12-10-2025 04:58:32 PM
మాలి మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): అసెంబ్లీలో తీర్మానం చేసి ఆమోదం కోసం కేంద్రానికి పంపి మూడేళ్లు గడిచినా మాలీల ఎస్టీ హోదా బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉందని, అది వెంటనే ఆమోదించి, మాలీలకు ఎస్టీ హోదా కల్పించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే డిమాండ్ చేశారు. మాలి సంఘ ఉద్యమ జండా పండుగ వారోత్సవాలలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని ఫూలే గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల చిత్ర పటానికి పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు. అనంతరం సంఘం జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 2016లో తీర్మానం చేసి ముస్లిం రిజర్వేషన్లతో పాటు మాలీలకు ఎస్టీ హోదా కల్పించి గిరిజన రిజర్వేషన్లను 10 శాతం పెంచాలని కేంద్రానికి సిఫారసు చేసిందన్నారు. ముస్లిం బిల్లుతో కాకుండా ఎస్టీల రిజర్వేషన్ బిల్లు పెంపు ప్రత్యేకంగా పంపాలని కేంద్రం రాష్ట్రానికి సిఫార్సులు చేసినా, సందర్భంగా 2023లో మళ్లీ ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశమై అందులో వాల్మీకి బోయ, కైతీ లబాన,మాలి (బారే) కులస్తులను కలిపి 10% ఎస్టి రిజర్వేషన్లను అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సిఫారి చేసిందన్నారు. అయినా అది ఇప్పటికీ ఆమోదించకుండానే కేంద్రం వద్ద పెండింగ్లో ఉంచుకుందని తెలిపారు.
ఏది ఏమైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అసంబద్ధ ప్రకటనల వల్ల మాలీ, మథుర, వాల్మీకి బోయ కులాలు నష్టపోతున్నాయని, వెంటనే వారికి సామాజిక న్యాయం లభించాలంటే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పది శాతం గిరిజన రిజర్వేషన్లలో ఈ మూడు కులాలనూ కలిపి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మాలి, మథుర, వాల్మీకి బోయ మూడు కులాలు జేఏసీగా ఏర్పడి ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచైన మహాత్మ జ్యోతిరావు పూలే దంపతుల స్ఫూర్తితో ఉద్యమించి మాకు రావలసిన రిజర్వేషన్ ఫలాలను పొందుతామని సుకుమార్ పెట్కులే అన్నారు. అలాగే ఈ నెల 16 వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మాలి కులస్తుల గ్రామాల్లో జెండాలను ఎగురవేసి ప్రభుత్వాలపై ఎస్టీ హోదా కోసం ఒత్తిడి పెంచాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాలి మహా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న శేండే, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్, రాష్ట్ర కోశాధికారి సతీష్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఉమేష్ రావు, తదితరులు పాల్గొన్నారు.