నీళ్ల సమస్యకు కాంగ్రెస్సే కారణం
దానిపై గొడవ చేస్తున్నది బీఆర్‌ఎస్
- సుప్రీంకోర్టులో కేసు ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారు?
- చలాన్ల పేరుతో ఖాతాల నుంచి డబ్బులు గుంజొద్దు
- జిల్లాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం పెట్టాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): నది జలాల సమస్యకు అసలు కారణం కాంగ్రెస్ అని, దానిపై రాద్దాం తం చేస్తున్నది బీఆర్‌ఎస్ అని, ఈ రెండు పార్టీలకు నీళ్ల సమస్య పరిష్కా రం ఇష్టంలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్‌రావు అన్నారు. సుప్రీంకోర్టులో ఎందుకు కేసు వేశారు, ఎందుకు విత్‌డ్రా చేసుకున్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. చలాన్ల పేరుతో వాహనదారుల ఖాతాలో నుంచి డబ్బులు గుంజడం సరైంది కాదని, వారికి ట్రాఫిక్ రూల్స్‌పైన అవగాహన కల్పించాలని సూచించారు.
ఫ్యూచర్ సిటీకి రేవంత్‌రెడ్డి తన మామ జైపాల్‌రెడ్డి పేరు పెట్టాలని చూస్తున్నారని, ఇష్టమొచ్చినట్లు జిల్లాలు, పేర్లు పెట్టుకోవద్దని సూచించారు. జిల్లాల పునర్విభజనపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, ప్రజల అభిప్రాయా లు తీసుకోవాలని తెలిపారు. మంగళవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో రాంచందర్‌రావు చిట్ చాట్ చేశారు. రిటైర్డ్ జడ్జిని పెట్టి జిల్లాల పునర్విభజన చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. తెలంగాణ వాదం బలహీన పడినప్పుడల్లా బీఆర్‌ఎస్ నీళ్ల నినాదం ఎత్తుకుంటుందని అభిప్రాయపడ్డారు.
రెం డు రాష్ట్రాలు నీటి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవచ్చని, గతంలో కావేరి నీటి పంపకంలో తమిళనాడు, కర్ణాటక మధ్య నెలకొన్న సమస్యను నాటి ప్రధాని వాజ్‌పేయి పరిష్కరించారని గుర్తు చేశారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలకు నీటి సమస్య పరిష్కారం కావడం ఏమాత్రం ఇష్టం లేదని విమర్శించారు. శాశ్వత పరిష్కారం చూడకుండా కోర్టుకు వెళ్లి సాగదీస్తున్నారని, ఈ సమస్యకు బీజేపీయే పరిష్కారం చూపిస్తుందన్నారు. నీటి సమస్య విషయంలో తాము తెలంగాణ పక్షాన ఉంటామన్నారు.
నాకు వ్యతిరేకంగా ఎవరూ సమావేశం పెట్టుకోలేదు..
నాకు వ్యతిరేకంగా ఎవరు సమావేశం పెట్టుకోలేదని, బీజేపీ ఎంపీలు విడిగా సమావేశం కావడంలో తప్పు లేదని, పార్టీ బలోపే తం మీదనే ఎంపీ లు చర్చించారని రాంచందర్‌రావు స్పష్టం చేశారు. పార్టీ ప్రజాప్రతి నిధులు, పార్టీ నేతలంతా మద్దతుగా ఉన్నారని, ఎవరైనా పార్టీ లైన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తే నేరుగా పీఎంకే ఫిర్యాదు చేస్తానని తెలిపారు. హిజాబ్ ధరించిన మహిళను పార్టీ ప్రెసిడెంట్ చేయాలని, ఆ తర్వాత ప్రధా ని అభ్యర్థి గురించి మాట్లాడాలని ఓవైసీని ఉద్దేశించి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసదుద్దీన్ ఒక్క మహిళకైనా ఎమ్మె ల్యే టికెట్ ఇచ్చారా? ఆ పార్టీలో ఎంత మంది మహిళా నాయకులున్నారు అని ప్ర శ్నించారు. తాము ఏనాడు హిందువుల పే రుతో ఓట్లు అడుగలేదని, తమకు అందరి ఓ ట్లు కావాలని చెప్పారు. కానీ, కాంగ్రెస్ బాహాటంగా ముస్లింల పేరుతో ఓట్లు అడుగు తుందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో ముస్లిం అంటే కాంగ్రెస్.. కాంగ్రెస్ అంటే ముస్లింలు అని సీఎం స్వయంగా చె ప్పారని గుర్తు చేశారు. వారు బీజేపీని హిం దువుల పార్టీ అనుకుంటే గర్వపడుతామని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదు..
మున్సిపల్ ఎన్నికల్లో ఎవరితో పొత్తు ఉండదని, సింగిల్‌గానే పోటీ చేస్తామని రాంచందర్‌రావు చెప్పారు. ‘జనసేన వారెవరు మా దగ్గరికి రాలేదు. మాతో చర్చలు జరపలేదన్నారు. జనసేన కూడా రాజకీయ పార్టీ.. వారు పోటీ చేస్తామని ప్రకటించడంలో తప్పేమీ లేదన్నారు. ఎవరైనా మద్దతు ఇస్తే తీసుకుంటామని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు అభ్యర్థి దొరకలేదని, ఇంకా ఆ పార్టీ ఎక్కడుందని ఆయన విమర్శించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పది వేల స్థానాలకు పోటీ చేస్తే రెండు వేలు గెలిచిందని, తాము ఐదు వేల స్థానాల్లో పోటీచేస్తే వెయ్యి గెలిచామని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లోనూ మెజార్టీ స్థానాలు సాధించుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే వారికే టికెట్లు ఇస్తామని, వలసవాదులకు ఇవ్వబోమని స్పష్టం చేశారు.
ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలి..
ట్రాఫిక్ నిబంధనలపై యువతకు కౌన్సెలింగ్‌తో రోడ్డు సేఫ్టీపై అవగాహన కల్పించా లని రాంచందర్‌రావు చెప్పారు. కానీ ఖాతాల్లోంచి డబ్బులు లాగేయడమేంటి? అని ప్రశ్నించారు. ఇంకా నయం సైకిళ్లకు టాక్స్ పెట్లేదని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కాబట్టి ఆర్థిక మూలాలు సమకూర్చుకోవడం కోసం ఇలా చలాన్లు వేస్తున్నారా? అని ప్రశ్నించారు. మద్యం సేవించి వాహనం నడపడం తప్పే అని, పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన వ్యక్తి వీడియోలు తీయడం కూడా తప్పే అని చెప్పారు. పోలీసులు వీడియోలు తీయడంతో అవమానంతో సూసైడ్‌లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.




