14-01-2026 01:33:31 AM
డాక్టర్ రాహుల్ కట్ట రామాంజనేయ, గ్రూప్ లీడ్, అత్యవసర వైద్య విభాగం, స్టార్ హాస్పిటల్స్
హైదరాబాద్, జనవరి 13 (విజయక్రాంతి): సంక్రాంతి పండుగ వేళ పతంగుల దారాలతో జాగ్రత్తగా ఉండాలని, గాజుతో పూతపూసిన లేదా సింథటిక్ పతంగుల దారాల (మాంజా) కారణంగా తీవ్ర గాయాల కేసులు అత్యవసర విభాగాల్లో పెరుగుతున్నాయని డాక్టర్ రాహు ల్ కట్ట రాజాంజనేయ (గ్రూప్ లీడ్, డాపార్ట్‌మెంట్ ఆఫ్ ఎమర్జెన్సీ మెడిసిన్, స్టార్ హాస్పి టల్స్ హైదరాబాద్) హెచ్చరిస్తున్నారు. ‘సంక్రాంతి రోజుల్లో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు, పిల్లల్లో పతంగుల దారాల వల్ల గాయాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. చైనా మాంజా గాయాల కారణంగా ఎమర్జెన్సీ విభాగాలకు వచ్చే రోగుల సంఖ్య సాధారణ రోజుల కంటే 20--30 శాతం వరకు పెరుగుతోంది. చాలా కేసుల్లో మెడ, చేతులు, మణి కట్టులు, ముఖంపై లోతైన కోతలు ఏర్పడి, కుట్టులు వేయాల్సిన పరిస్థితి లేదా శస్త్రచికిత్స అవసరం అవుతోంది. కొంతమందికి అధిక రక్తస్రావం వల్ల నిరంతర వైద్య పర్యవేక్షణ అవసరమవుతోంది.
అలాగే అకస్మాత్తుగా గాయం కావడంతో వాహన నియంత్రణ కోల్పోయి రోడ్డు ప్రమాదాలు, ఎముక విరుగుడు గాయా లు కూడా జరుగుతున్నాయి. పతంగు దారం వల్ల గాయం అయితే వెంటనే సురక్షిత ప్రదేశానికి వెళ్లాలి. శుభ్రమైన గుడ్డ లేదా స్టెరైల్ గాజు తో 10-- నిమిషాలు బలంగా ఒత్తాలి. గాయాన్ని బలంగా రుద్దకూడదు. రక్తస్రావం తగ్గిన తర్వాత శుభ్రమైన నీటితో మెల్లగా కడగాలి. యాంటిసెప్టిక్ రాసి శుభ్రమైన బ్యాండేజ్ వేయాలి. మెడ లేదా చేతికి గట్టిగా కట్టకూడ దు. రక్తస్రావం ఆగినట్టు అనిపించినా వైద్య పరీక్షను ఆలస్యం చేయవద్దు’ అని ఆయన సూచిస్తున్నారు. ఒత్తినా ఆగకపోతే వెంటనే ఆస్పత్రికి వెళ్లాలని చెపుతున్నారు. నిషేధితమైన లేదా గాజుతో పూతపూసిన మాంజాను ఉపయోగించవద్దు అని ఆయన కోరుతున్నారు. ద్విచక్ర వాహనదారులు విజర్ ఉన్న హెల్మెట్, పూర్తి చేతుల దుస్తులు ధరించాలి.