సీపీఎస్ రద్దు చేసి పీఆర్సీ అమలు చేయాలి
తపస్ జిల్లా అధ్యక్షులు దత్తాత్రి
నారాయణఖేడ్, ఆగస్టు 9 (విజయక్రాంతి) : తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నారాయణఖేడ్ డివిజన్ సమావేశం స్థానిక శిశుమందిర్ లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా తపస్ జిల్లా అధ్యక్షులు దత్తాత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పట్ల ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని, పీఆర్సీ వెంటనే ప్రకటించి, డీఏ బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి ప్రధాన ఎన్నికల హామీని సీపీఎస్ రద్దును పూర్తిగా మర్చిపోయారని అన్నారు.
ప్రీ ప్రైమరీ బడులల్లో కొత్త నియామకాలు పూర్తి చేయాలని కోరారు. లేదంటే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పెద్ద ఎత్తున అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం పర్యావరణవేత్త, ఇప్పటి వరకు 20 వేల మొక్కలు స్వయంగా నాటడమే కాకుండా మంజీరా పరివాహక ప్రాంతంలో మొక్కలు నాటుతూ ప్లాస్టిక్ తొలిగిస్తున్న జ్ఞానేశ్వర్ ను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో రాష్ట్ర సేవ కో కన్వీనర్ చంద్రశేఖర్ ఆచార్య ,జిల్లా గౌరవ అధ్యక్షులు చంద్రకాంత్, జిల్లా బాధ్యులు వినయ్, రాజయ్య, రాజశేఖర్, ఇతర బాధ్యులు రతన్ సింగ్, మచ్చందర్, మహేశ్, పద్మ నాభం, రాజు, జగదీశ్వర్లు పాల్గొన్నారు.






