మూల మలుపులో ముళ్లపొదలు.. ప్రమాదాలకు ఆహ్వానం
కంగ్టి, ఆగస్టు 9 (విజయక్రాంతి): కంగ్టి మండలం నుండి తడ్కల్ వెళ్లే మార్గంలోని చాప్టా(బి )మూల మలుపు వద్ద వాహనదారులకు ప్రమాదం పొంచి ఉంది. రోడ్డుకు ఇరువైపులా ముళ్లపొదలు ఏపుగా పెరగడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించకపోవడంతో తరచూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. ముఖ్యంగా మూల మలుపు వద్ద రహదారిని ఆనుకుని పెరిగిన ముళ్లపొదలు వాహనదారుల చూపును అడ్డుకుంటున్నాయి.
దీంతో ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కనిపించని సూచిక బోర్డు కారణంగా వాహనదారులు మరింత ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కాకుండా, ముందుగానే అధికారులు స్పందించి ముళ్లపొదలను తొలగించి, అవసరమైన చోట స్పష్టమైన హెచ్చరిక సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి రహదారిని సురక్షితంగా మార్చాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు






