గిరిజన బిడ్డ ఎదుగుదలను చూసి ఓర్వలేకనే అసత్యపు ప్రచారాలు
సేవాలాల్ బంజారా సంఘం అధ్యక్షుడు మోతీలాల్ నాయక్
ముషీరాబాద్, మే2(విజయక్రాంతి): గిరిజన బిడ్డ ఎదుగుదలను ఓర్వలేక కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ ప్రముఖ గాయని మంగ్లీని అభాసుపాలు చేస్తున్నారని సేవాలాల్ బంజారా సం ఘం అధ్యక్షుడు మోతీలాల్ నాయక్ ఆరోపించారు. కావాలనే ఆమెను వ్యక్తి గతంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
ఈ మేరకు శనివారం హైదర్ గూడలోని న్యూస్ సెంటర్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ పనిగట్టుకుని వ్యూస్ కోసం గాయని మంగ్లీ పై ఇష్టారీతిన అసభ్యకరంగా లేనివి ఉన్నట్లుగా గ్లోబల్ ప్రచారం చేస్తూ ఆమెతోపాటు కుటుంబాన్ని కూడా లాగి ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజన బిడ్డ ఎదుగు దలను ఓర్వలేక నానా రకాలు ఇబ్బందులు పెడుతూ పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు.
ఒక ఇద్దరూ కావాలనే మీడియా ముందుకు వస్తూ పథకం ప్రకారం మంగ్లీ ని టార్గెట్ చేస్తున్నారని, కేసు పోలీసు దర్యాప్తు లో ఉందని, ఒకవేళ మంగ్లీ తప్పు చేస్తే ఎక్కడి రమ్మంటే అక్కడికి వస్తానని ఆయన సవాల్ విసిరారు. మంగ్లీ జోలికొస్తే సహించేది లేదని, ఆమెకు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంజారాలు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
మంగ్లీని ఎవరైనా దూషిస్తే ఇకపై ఊరుకునేది లేదని వారి నాలుక కోస్తామని ఆయన హెచ్చరించారు. మైక్రో ఫైనాన్స్ విషయంలో నిజనిజాలు నిగ్గు తేల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర డిజీపీ చొరవ తీసుకుని సీబీసీఐడీ తో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పలువురు సంఘం నేతలు పాల్గొన్నారు.






