17-11-2025 12:00:00 AM
-ఎదురుచూస్తున్న ఆశావహులు
-పాత అధ్యక్షుడికే ఛాన్స్ ఉంటుందా.. లేక కొత్తవారికా?
-కాంగ్రెస్ శ్రేణుల్లో వీడని ఉత్కంఠ
కుమ్రం భీం ఆసిఫాబాద్, నవంబర్ 16(విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఎంపికపై వీడని పీఠముడి. డీసీసీ ఎన్నిక ప్రక్రియ పూర్తి జరిగే దాదాపు నెలరోజులవుతున్న కాంగ్రెస్ పార్టీ అధిష్టానం జిల్లా కొత్త బాస్‌లో ప్రకటించకపో వడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ కొనసాగుతుంది.అధ్యక్ష పదవి కోసం దాదాపు 30 మందికి పైగా దరఖాస్తులు చేసుకోగా 28 మంది పీసీసీ ప్రతినిధి నరేష్ కుమార్ ఎదుట వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరయ్యా రు.
ఇందులో నుంచి ముగ్గురి పేర్లు అధిష్టానానికి నివేదించడం జరుగుతుందని ఆయన తెలిపారు.అధిష్టానం వద్దకి నివేదిక వెళ్ళినప్పటికీ జిల్లా అధ్యక్ష పదవి కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పున ర్ ఆలోచనలో పడ్డట్లు విశ్వసనీయ సమాచారం.దరఖాస్తు చేసుకున్న వారిలో పార్టీ బాధ్యత మోయగలంతా శక్తి ఉందా అనే కోణంలో పార్టీ వివిధ వర్గాల ద్వారా సమాచారం సేకరించినట్లు తెలిసింది.
పార్టీ అధిష్టా నం పాతవారిని కొనసాగించేది లేదని కనీసం ఐదు సంవత్సరాలు పార్టీలో పనిచేయాలని నిబంధనలను విధించిన విషయం విధితమే.పార్టీ నిబంధనలు పెట్టినప్పటికీ జిల్లాకు వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ పునర్ ఆలోచనలో పడ్డట్లు తెలిసింది.బలమైన నాయకుడిని డిసిసి అధ్యక్షుడిగా నియమించాల్సిన పరిస్థితి ఉండడంతో ప్రస్తుతం కొనసాగుతున్న కొక్కిరాల విశ్వప్రసాద్‌ను కొన సాగించడం లేదా నిబంధనలు సడలించి కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిలో ఒకరిని ఎంపిక చేయడమా అనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు తెలిసింది.
డిసిసి పదవిపై మొదట ఎంతోమంది ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ పదవికి తమ అర్హులము కాదని జిల్లాస్థాయిలో పార్టీని నడపడం కష్టతరమని దరఖాస్తు చేసుకున్నవారు పలు సందర్భాలలోనూ చర్చించుకున్నారు. ఇంతే కాకుండా పార్టీ వర్గీయులు సైతం దరఖాస్తు చేసుకున్న వారిలో పార్టీ నడిపే అంతా సత్తా ఉందా మరి ఎవరికైనా ఇందులో కేటాయిస్తే పార్టీ బలోపేతం అవుతుందా అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది.
నిబంధనలు సడలిస్తే..
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి కేటాయింపులో ఆ పార్టీ విధించిన నిబంధనలు సడలిస్తే డిసిసి ఎవరికి వస్తుందని చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది.మొన్నటివరకు దరఖాస్తు చేసుకున్న వారు తమకే వస్తుందని ఎంతో ఆశతో ఉన్నారు. నిబంధనలు సడలిస్తే ప్రస్తుతం డిసిసిగా కొనసాగుతున్న కొక్కిరాల విశ్వ ప్రసాద్ కే కేటాయిస్తారా..?
ఉమ్మడి అదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ప్రాతినిథ్యం వహిస్తున్న బీసీ వర్గానికి చెందిన దండే విఠల్ కు కేటాయిస్తారా...?లేకపోతే ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న ఎస్టి లంబాడ సామాజిక వర్గానికి చెందిన అజ్మీర స్వామ్ నాయక్ ను చేస్తారా...?ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చెందిన అదిలాబాద్ జిల్లా జన్నారం కు చెందిన ఎస్టీ గోండ్ (మహిళ) సామాజిక వర్గానికి చెందిన ఆత్రం సుగుణక్క ను పరిగణలోకి తీసుకుంటారా అనే విషయం తెరపైకి వచ్చింది.
దీనికి తోడు కాంగ్రెస్ సీనియర్ నాయకులు శ్రీ వర్ధన్,అనిల్ గౌడ్,సోమయ్య లను డిసిసిగా పార్టీ ప్రకటిస్తుందా అని వేచి చూడాల్సిన సమయం ఇంకా ఉంది.పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యత బలమైన నాయకుడికి అప్పగించాలి అనుకుంటే మాత్రం జిల్లాకు నిబంధనలను పక్కన పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
రెండు అసెంబ్లీలలోనూ ఎమ్మెల్యే లేరు..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ జిల్లాలో మాత్రం ఎమ్మెల్యేలు ఇతర పార్టీలకు చెందిన వారు కోవ లక్ష్మి( బిఆర్‌ఎస్),పాల్వాయి హరీష్ బాబు (బిజెపి) ఉండడంతో ప్రభుత్వ కార్యక్రమాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండె విఠల్ ఒక్కడే తన భుజస్కందాలపై వేసుకొని ముందుకు వెళుతున్నాడు.
జిల్లా కాంగ్రెస్ ’అధ్యక్షుడు గా కొనసాగుతున్న విశ్వ ప్రసాద్ రావు గతంలో పది సంవత్సరాలు ప్రతిపక్షంలో కార్యకర్తల పక్షాన ఉండి పార్టీని కాపాడుకుంటూ వచ్చాడని ఆయనకే డిసిసి నీ కొనసాగించాలని పార్టీలో కొంతమంది అధిష్టానాన్ని కోరుతున్నారు.
2023 ఎన్నికల్లో అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓటమి చెందిన శ్యామ్ నాయక్ సైతం తను డీసీసీ బాధ్యతను స్వీకరించేందుకు సిద్ధంగా ప్రచారం జరుగుతుంది.ఎమ్మెల్సీ దండేవిఠల్ సైతం పార్టీ ఆదేశిస్తే జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పార్టీ బాధ్యతలను నిర్వర్తించేందుకు సిద్ధమేనని,రెండు నియోజకవర్గాలలో నీ కార్యకర్తలను ,నాయకులను సమన్వయం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.