2 March, 2026 | 1:46 AM

పట్టా ఒకరిది.. వ్యాపారం మరొకరిది!

02-03-2026 12:00 AM
  1. సర్టిఫికెట్ కొనుక్కో మెడికల్ షాప్ పెట్టుకో?
  2. మంగపేటలో మెడికల్ దందా
  3. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న మెడికల్ షాపులు
  4. నిభందనలకు పాతర 
  5. పట్టించుకోని అధికారగణం 

మంగపేట, మార్చి 1 ( విజయక్రాంతి ) : ములుగు జిల్లా మంగపేట మండలంలో మెడికల్ షాపుల దందా  కొనసాగుతుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజల నిరక్ష్యరాస్యత, వైద్య అవసరాలను క్యాష్ చేసుకునే కొంతమంది ఆర్‌ఎంపి, పిఎంపిలు మెడికల్ షాపుల యజమానులతో కుమ్మక్కై పర్సంటేజీలు మాట్లాడుకుని జనరిక్ మందులు రాస్తూ అవసరమున్నా లేకున్నా కొన్ని రకాల విటమిన్ టానిక్లు, టాబ్లెట్లు అంటగడుతున్నారని విమర్శలు వినవస్తున్నాయి.

ఆ ఆర్‌ఎంపిలు, పిఎంపిలు చెప్పిన మెడికల్ షాపులో కాకుండా వేరే మెడికల్ షాపులో మందులు కొనుక్కుంటే ఆర్‌ఎంపి, పిఎంపిలు వాటిని తిప్పి పంపిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉదాహారణకు మండలంలోని ఒక్క మల్లూరు గ్రామంలోనే నాలుగు మెడికల్ షాప్స్ ఉండగా అందులో కనీసం ఏ ఒక్కరూ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండానే మెడికల్ షాపులు నిర్వహిస్తుండడం చూస్తుంటేనే మండలంలో బినామీ మెడికల్ షాపుల దందా ఎలా సాగుతుందనే విమర్శలు వస్తున్నాయి.

రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండానే!

మండలంలో చాలా మంది మెడికల్ షాప్ నిర్వాహకులు రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండానే  మెడికల్ షాప్స్ నిర్వహిస్తున్నారు. రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండా, సర్టిఫికెట్లను అద్దెకు తీసుకుని, ఫార్మాసిస్ట్ కోర్స్ చేసిన వారికి సంవత్సరానికి ఇంత అని కొంత గుడ్ విల్ ఇచ్చి  కొంతమంది మెడికల్ షాపులు పెట్టుకుని వైద్య ఆరోగ్య శాఖ నిభందనలకు భిన్నంగా రోగుల జేబులు ఖాళీ చేస్తున్నారు. మంగపేట మండల వ్యాప్తంగా మొత్తం 22 మెడికల్ షాప్స్ ఉన్నాయి.

అందులో కమలాపురంలో రెండు, మంగపేటలో ఒకటి, తిమ్మంపేటలో ఒకటి, రాజుపేటలో ఒకటి మొత్తం ఐదు మెడికల్ దుకాణాలను మాత్రమే రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్స్ నిర్వహిస్తుండగా మిగిలిన 17 మెడికల్ షాప్స్ ఫార్మాసిస్ట్ సర్టిఫికేట్ హోల్డర్ కాకుండా ఇతరులు నిర్వహిస్తున్నారు.

ఫార్మాసిస్ట్ డిప్లమా హోల్డర్ నుండి సర్టిఫికెట్ సంపాదించి బినామీ పేరుతో యధేచ్ఛగా వ్యాపారం సాగిస్తుండడంమే కాక కొన్ని కొన్ని మెడికల్ షాపులలో వైద్యం, మందులపై ఎటువంటి అనుభవం లేని వారితో మందులు అమ్మిస్తున్నారు. దీంతో ప్రజల జీవితాలకు భరోసా కరువైందని రోగులు గగ్గోలు పెడుతున్నారు.

యధేచ్చగా నిబంధనలు ఉల్లంఘనలు

మండలంలో ఎక్కువ శాతం మెడికల్ షాప్ నిర్వాహకులు నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ షాప్స్ నిర్వహిస్తున్నారు. యాంటీ బయాటిక్స్, షెడ్యూల్ హెచ్ 1, ఎక్స్ మందులను, హై బ్లడ్ ప్రెషర్ ( హై బీపీ ) కోసం నార్కోటిక్ టాబ్లెట్స్, కిడ్నీ స్టోన్స్ కోసం ధవ సిరప్, డయాబెటిస్ కోసం డికో టాబ్లెట్స్ లాంటి స్టెరాయిడ్స్ను ఎంబీబీఎస్ డాక్టర్ ప్రెస్కిప్షన్ లేకుండా మెడికల్ షాప్ నిర్వాహకులు విక్రయిస్తున్నారన్నది బహిరంగ రహస్యమే.

కొన్ని మెడికల్ దుకాణాల నిర్వాహకులు షెడ్యూల్ హెచ్ 1 మందుల కొనుగోలు, అమ్మకాల రిజిస్టర్లను సరిగ్గా నిర్వహించడం లేదని తెలుస్తుంది. అక్రమ మందులు, ప్రభుత్వ సరఫరా మందులు, ఫిజీషియన్ శాంపిల్స్, మత్తును కలిగించే మందుల ( హాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ) అక్రమంగా విక్రయిస్తున్నారని, కొన్న మందులకు  బిల్లులు ఇవ్వకపోవడం, గడువు ముగిసిన మందుల నిల్వ వంటివి కూడా జరుగుతున్నాయనే ప్రచారం జరుగుతుంది. 

అధికారుల తీరుపై విమర్శలు..

మండలంలో ఎక్కువ శాతం మెడికల్ షాపులు నిభంధనలకు విరుధ్ధంగా నడుస్తున్నా పట్టించుకోవాల్సిన సంభందిత అధికారులు చూసీ చూడనట్లు ‘మామూలుగా’ తీసుకుంటున్నారని విమర్శలు వినవస్తున్నాయి. మెడికల్ షాపుల నిర్వాహణను తనిఖీలు చేయాల్సిన అధికారులు కొంతమంది అసలు మెడికల్ షాపులను తనీఖీలు చేయడంలేదని, మెడికల్ షాపుల యూనియన్ నాయకులను పిలిపించుకునో, కలిసో అక్కడే అన్ని విషయాలు చర్చించి అట్నుంచి అటే వెళ్ళిపోతున్నారనే ఆరోపణలు సైతం వినవస్తున్నాయి.

ఇప్పటికైనా ఔషధ నియంత్రణ అధికారులు (డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్లు) స్పందించి నిబంధనలు పాటించని మెడికల్ షాపుల డ్రగ్ లైసెన్సుల రద్దు చేయాలని, నిభందనలకు విరుద్ధంగా మెడికల్ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఫార్మాసిస్ట్ సర్టిఫికెట్ దుర్వినియోగం చేస్తున్న వారి సర్టిఫికెట్ రద్దు చేయాలని, ఫార్మాసిస్ట్ సర్టిఫికెట్ దుర్వినియోగం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జనం కోరుతున్నారు.

రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్‌తోనే మెడికల్‌షాప్ నిర్వహించాలి

మెడికల్ షాప్స్ రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ తోనే నిర్వహించాలి. త్వరలో మంగపేట మండలంలో మెడికల్ షాప్స్ తనిఖీ చేస్తాం. రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండా, నిభందనలు ఉల్లంఘించి మెడికల్ షాప్స్ నిర్వహించే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

- పావని, డ్రగ్ ఇన్స్పెక్టర్