2 March, 2026 | 3:30 AM

విద్యా కమిషన్ నివేదికపై ఎస్టీయూ ఆందోళన

02-03-2026 12:00 AM

వెంకటాపూర్,  మార్చి 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్యా సంస్కరణల కోసం ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన నివేదికలోని కొన్ని ప్రతిపాదనలు ప్రభుత్వ పాఠశాలల మనుగడకు ప్రమాదకరంగా మారే అవకాశముం దని స్టేట్ టీచర్స్ యూనియన్ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి ఏళ్ళ మధుసూదన్ ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, మౌలిక వసతుల అభివృద్ధి, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో ఉపాధ్యాయుల జీతాలపై ప్రతికూల వ్యాఖ్యలు చేయడం విచారకరమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు అనేక ఇబ్బందుల మధ్య విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. బోధనతో పాటు ఉపాధ్యాయులు ఎన్నికల విధులు, జనగణన, సర్వేలు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలు వంటి అనేక అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల సేవలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, వారి జీతాలను తగ్గించాలనే సూచనలు చేయడం ఉపాధ్యాయుల మనోబలాన్ని దెబ్బతీసే చర్యగా భావిస్తున్నామని పేర్కొన్నారు. విద్యా కమిషన్ నివేదికలో ఉపాధ్యాయుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న సూచనలను ప్రభుత్వం పునఃపరిశీలించాలని, విద్యా సంస్కరణలపై నిర్ణయాలు తీసుకునే ముందు ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదింపులు జరపాలని ఏళ్ళ మధుసూదన్ కోరారు.