28-07-2025 12:53:24 AM
-ప్రజల కష్టాలు సర్కార్‌కు పట్టవు
- బీసీ రిజర్వేషన్లను ఇతరులకు పంచితే యుద్ధమే
- ‘ఉడ్తా తెలంగాణ’ కాదు.. అభివృద్ధి తెలంగాణ కావాలి
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
వనపర్తి, జూలై 27 (విజయక్రాంతి): కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలోని ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ఆ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, కానీ ప్రజల కష్టాలను పట్టించుకొనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్‌రావు ఆరోపించారు.
ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని మున్నూరుకాపు ఫంక్షన్‌హాల్‌లో జిల్లా అధ్యక్షుడు నారాయణ, స్థానిక సంస్థల ఎన్నికల జిల్లా కన్వీనర్ పురుషోత్తంరెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ డీకే అరుణతో కలిసి పాల్గొన్నారు. గద్వాల్ నుంచి జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకు కార్యకర్తలు బైక్ ర్యాలీలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనపర్తి జిల్లా ప్రజలతో నాకు విడదీయలేని అనుబంధం ఉందన్నారు.
ఈ ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల వల్ల భూములు కోల్పోయిన నిర్వాసితులకు ఇంకా తగిన పరిహారం ఇవ్వలేదని, ఎత్తిపోతల నిర్మాణాల వల్ల భూములు కోల్పోయిన వారికి ఈరోజు వరకు న్యాయం జరగలేదన్నారు. ప్రజలకిచ్చిన మాట ప్రకారం భూములు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పిందని.. ఇప్పుడు ఆ జాబ్ క్యాలెండర్ ఏమైందని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద డబ్బుల్లేవని, ఉద్యోగుల జీతాలు కూడా ఇవ్వలేకపోతున్నామని చెబుతున్న కాంగ్రెస్ పెద్దలు ప్రజలకిచ్చిన హామీలను ఎలా నెరవేరుస్తారని నిలదీశారు.
రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత, విద్యార్థులు తమ భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమేనని ఆరోపించారు. ప్రజల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇలా నాశనం చేయడం సరికాదన్నారు.
తమకు కావాల్సింది ‘ఉడ్తా తెలంగాణ’ కాదని.. అభివృద్ధి చెందిన తెలంగాణ అవసరమన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకిచ్చిన 42 శాతం రిజర్వేషన్లపై బీజేపీ నిలదీస్తుందని, ఇందులో ముస్లింలకు 10 శాతం ఇవ్వడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తుందన్నారు.
స్థానిక ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయాలి: ఎంపీ డీకే అరుణ
దేశచరిత్రలో మోదీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షతులై బీజేపీ వైపు చూస్తున్నారని.. కాంగ్రెస్ మోసపూరిత హామీలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి పట్టం కట్టాలని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. పేద ప్రజలు ఆర్థికంగా ఎదిగిన రోజే పేదరికం పోయి ఆర్థిక సమానత్వం సాధ్యమవుతుందనే నమ్మకంతో ప్రధాని మోదీ పేదలకు, మహిళలకు, యువకులకు, రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు.
విద్యా, వైద్య రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ పట్టణాలతో సమానంగా గ్రామాల అభివృద్ధికి కూడా అత్యధికంగా నిధులు కేటాయిస్తున్నారని చెప్పారు. కరోనా నుంచి నుంచి నేటి వరకు 80 కోట్ల మంది ప్రజలకు ఉచితంగా ఐదు కిలోల బియ్యం పంపిణీ చేస్తున్నారని గుర్తు చేశారు. పదేండ్ల అవినీతి బీఆర్‌ఎస్ పార్టీని ఇంటికి పంపించారని, 421 హామీలతో అధికారంలోకి వచ్చి 20 నెలలైనా మాటలు తప్ప రేవంత్ రెడ్డి చేతల్లో చూపిందేమీ లేదని మండిపడ్డారు.
సమావేశంలో మాజీ ఎంపీ పోతుగంటి రాములు, జాతీయ ఓబీసీ కమిషన్ మాజీ సభ్యులు తల్లోజు ఆచారి, పోతుగంటి భరత్ ప్రసాద్, మాజీ శాసనసభ్యులు డాక్టర్ రావుల రవీంద్రనాథ్ రెడ్డి, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లోకనాథ్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సబిరెడ్డి వెంకటరెడ్డి, అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మున్నూరు రవీందర్, గౌని హేమారెడ్డి, మోర్చా రాష్ట్ర నాయకులు బీ శ్రీశైలం, జ్యోతి రమణ, చిత్తారి ప్రభాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామన్‌గౌడ్ జిల్లా, నాయకులు సుమిత్ర, కుమారస్వామి, వెంకటేశ్వరరెడ్డి, బాశెట్టి శ్రీను, సీతారాములు, పెద్దిరాజు పాల్గొన్నారు.