15-12-2025 12:00:00 AM
మణికొండ, డిసెంబర్ 14 (విజయక్రాంతి): గ్రేటర్ పరిధిలో డివిజన్ల పునర్విభజన ప్రక్రియలో మణికొండకు తీవ్ర అన్యాయం జరిగిందని, అధికారుల తీరు అశాస్త్రీయంగా ఉందని బీజేపీ నాయకులు మండిపడ్డారు. ఆదివారం వారు మాట్లాడుతూ.. మణికొండ మున్సిపాలిటీ పరిధి లోని మణికొండ, పుప్పాలగూడ, నెక్నాపూర్ ప్రాంతాల్లో సుమారు 90 వేల జనాభా ఉన్నారని, ఓటర్ల సంఖ్య ప్రాతిపదికన చూస్తే ఇక్కడ ఆరు డివిజన్లు ఏర్పాటు చేయాల్సి ఉందన్నారు.
అయితే అధికారులు మాత్రం కేవలం మణికొండ (127), నెక్నాపూర్ (128) పేరిట రెండు డివిజన్లు మాత్రమే కేటాయించడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో కేవలం 20 వేల జనాభా ఉన్నా ఒక డివిజన్ను ఏర్పాటు చేశారని, కానీ 90 వేల జనాభా ఉన్న మణికొండలో మాత్రం కోతలు విధించడం సరికాదని హితవు పలికారు. మొత్తం 300 డివిజన్లను ఏర్పాటు చేస్తున్న క్రమంలో.. అందరికీ సమన్యాయం చేస్తూ, జనాభా ప్రాతిపదికన మణికొండలో ఆరు డివిజన్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
లేనిపక్షంలో ఓటర్లకు, స్థానిక అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు టి. అంజన్ కుమార్ గౌడ్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ కొండకల నరేందర్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బి. రవికాంత్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు శ్రీకాంత్ స్వామి, వందన నాగేష్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు జే. సిద్దప్ప, మాజీ అధ్యక్షుడు చిలుకూరి బీరప్ప, ప్రధాన కార్యదర్శులు జి. వినోద్, కంకణాల శివరాం రెడ్డి, కోశాధికారి వై. యాదయ్య, నాయకులు వేణు, కందుల శ్రీనివాస్ రెడ్డి, స్రవంతి, ఓరిస్ మధు, రేఖ ఆనందరావు, శంకర్ సింగ్, పక్కనాటి సత్యనారాయణ, హంసరాజ్, రాజేష్, భీమ్ రెడ్డి, రమేష్, బి. శివకుమార్, ఎం. గణేష్ బద్రి పాల్గొన్నారు.