15-12-2025 12:00:00 AM
ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి, వజ్రేశ్ యాదవ్‌లకు వినతిపత్రం అందజేత
మేడ్చల్ అర్బన్, డిసెంబర్ 14(విజయ క్రాంతి): పూడూరు పేరుతో జీహెచ్‌ఎంసి డివిజన్ వార్డును ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్ లకు వేర్వేరుగా వారి నివాసంలో కలసి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేడ్చల్ మున్సిపాలిటీని మేడ్చల్, కిష్టాపూర్ పేర్లతో రెండు వార్డులు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందని గుర్తు చేశారు.
అయితే కిష్టాపూర్ పేరుతో డివిజన్ వార్డును ఏర్పాటు చేయడం పట్ల తాము అభ్యంతరం వ్యక్తం చేసినట్లు పేర్కొన్నారు. పూడూరు గ్రామానికి 3500ఎకరాల రెవెన్యూ భూముల విస్తీర్ణం ఉందన్నారు. అంతేకాకుండా గ్రామంలో 4200మంది ఓటర్లు నివసిస్తున్నారన్నారు. దీంతోపాటుగా 14గ్రాములకు కేంద్రంగా ఆదర్శ రైతు సేవా సహకార కొనసాగుతుందన్నారు.గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పల్లె దవాఖాన, వెటర్నరీ ఆసుపత్రి, పోస్ట్ ఆఫీస్, గ్రంథాలయంతో పాటు అద్భుతమైన వార్డు ఆఫీస్ ఉందన్నారు.
పూడూరు గ్రామంతో పోల్చితే కిష్టాపూర్ లో తక్కువ మంది ఓటర్ల జనాభా ఉందన్నారు. రెవెన్యూ విస్తీర్ణం సైతం పూడూరు కన్నా తక్కువగా ఉందని చెప్పారు. కిష్టాపూర్ మేడ్చల్ కు అనుబంధ గ్రామంగా కొనసాగుతూ వచ్చిందని తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో మాజీ సర్పంచ్ నాలబాపని నర్సింహరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు సింగరేణి పోచయ్య, నీరుడి రఘు,మాజీ సొసైటీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, మాజీ వార్డు సభ్యుడు తుపాకుల కృష్ణ, గ్రామస్తులు పుట్నాల నర్సింహ, భాస్కర్ రెడ్డి, అశోక్ యాదవ్ ఉన్నారు.