ఏండ్ల కల.. సాకారమవుతున్న వేళ!
చొప్పదండి, మే 28: నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఎందరో యువకుల ప్రాణ త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్రంలో తమ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని ఊహించుకున్న ప్రజల ఆశలు గడిచిన పదేళ్లలో ఆశలుగానే మిగిలిపోయాయి. తెలంగాణలో తొలి అసెం బ్లీ ఎన్నికల్లో అప్పటి టీఆర్‌ఎస్ అభ్యర్థి బొడిగ శోభను ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు.
ఆ ఐదేండ్లలో కొంత అభివృద్ధి చేశారు. ఆ సమయంలో చొప్పదండి మండలం ఆర్నకొండ నుంచి రామడుగు మండలం గోపాల్‌రావుపేట మీదుగా గంగాధర మండలం బూర్గుపల్లి ద్వారా మల్యాల మండలం ర్యాలపల్లి వరకు రోడ్డు నిర్మాణం కోసం కృషిచేసినా నిర్మాణం జరుగలేదు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మరోసారి టీఆర్‌ఎస్‌కే పట్టంగట్టగా, గంగాధర మండలం బూర్గుపల్లికి చెందిన సుంకె రవిశంకర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈసారైనా రోడ్డు నిర్మాణం పూర్తయ్యి ఇబ్బందులు తొలగిపోతాయనుకున్న ప్రజలకు మళ్లీ నిరాశే మిగిలింది. సుంకె రవిశంకర్ నివాసం ఈ దారిలోనే ఉండటం గమనార్హం.
రోడ్డు గుంతలమయం.. ప్రయాణం నరకం
గోపాల్‌రావుపేట నుంచి బూర్గుపల్లి వర కు రహదారి ప్రయాణం గుంతలమయమై, ప్రయాణం నరకంగా మారింది. ఈ రోడ్డుగుండా ప్రయాణం చేయాలంటే ప్రయాణి కులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిం దే. గ్రానైట్ రాళ్లతో భారీ వాహనాలు వెళ్తుండటంతో రహదారి ప్రజలు నడవలేని స్థితికి చేరుతుంది. వర్షం కురిసిందంటే ఎక్కడ గుంత ఉందో తెలియని విధంగా ఉండేది.
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన ఐదు నెలల్లోనే స్థానిక ప్రజల బాధలను సిఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, గోపాల్‌రావుపేట నుంచి బూర్గుపల్లి వరకు రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూ.6 కోట్ల నిధుల విడుదల చేయించారు. ఎన్నో ఏండ్ల కల సాకారమవుతున్నవేళ స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






