calender_icon.png 14 January, 2026 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నివాస ప్రాంతాల్లో డంపింగ్ యార్డా? ప్రజల ప్రాణాలతో చెలగాటమా?

14-01-2026 02:19:07 AM

తక్షణమే కమలనగర్‌లో ఉన్న డంపింగ్ యార్డును ఎత్తివేయాలి..  

బీజేపీ రాష్ట్ర నేత తల్లోజు ఆచారి డిమాండ్

ఆమనగల్లు, జనవరి 13( విజయక్రాంతి): ఆమనగల్ మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డు, కమల నగర్ కాలనీలో నివాస గృహాల మధ్య అక్రమంగా ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డును తక్షణమే తొలగించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు శ్రీ తల్లోజు ఆచారి డిమాండ్ చేశారు. శనివారం  ఆమనగల్లు లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, మున్సిపల్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ప్రజలు నివసించే ప్రాంతానికి అతి సమీపంలో చెత్తను కుప్పలుగా పోయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ డంపింగ్ యార్డు కారణంగా కాలనీవాసులు ఎదుర్కొంటున్న సమస్యలను మున్సిపల్ కమిషనర్ కు విన్నవించారు.

చెత్త కుప్పల నుండి వెలువడుతున్న విపరీతమైన దుర్వాసనతో స్థానికులు శ్వాస తీసుకోవ డానికి ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. డంపింగ్ యార్డు ద్వారా ఈగలు, దోమలు విపరీతంగా పెరగడంతో డెంగ్యూ, మలేరియా వంటి అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీలో ఉండే చిన్నపిల్లలు, వృద్ధులు ఈ కాలుష్యం వల్ల తరచూ అనారోగ్యానికి గురవుతున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ శంకర్  ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని యుద్ధ ప్రాతిపదికన ఈ డంపింగ్ యార్డును నివాస ప్రాంతాల నుండి దూరంగా తరలించాలని కోరారు. నిర్లక్ష్యం వహిస్తే కాలనీ ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తల్లోజు ఆచారి హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా పక్కా ప్రణాళికతో వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని ఆయన సూచించారు.