calender_icon.png 8 January, 2026 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అశాంతి రేపుతున్న ట్రంప్ చర్యలు!

06-01-2026 12:00:00 AM

సుంకవల్లి సత్తిరాజు :

* నోబెల్ శాంతి బహుమతి వస్తే థియోడోర్ రూస్‌వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామాల సరసన నిలబడే అవకాశం వస్తుందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కలగన్నారు. కానీ వెనిజులాకు చెందిన మహిళా నాయకురాలు, ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకోవడం ట్రంప్‌కు మింగుడు పడలేదు. 

ప్రపంచంలోనే అతి పెద్ద చమురు నిల్వలున్న వెనిజులా దేశంపై అమెరికా దాడి చేసి, ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించడం దుర్మార్గమైన అంశంగా చెప్పవచ్చు. శాంతి కాముకుడిగా తనను తాను ప్రకటించుకున్న ట్రంప్ వెనిజులాపై దాడితో తన మనసులోని విషపూరిత చర్యను మరోసారి బహిర్గతం చేసుకున్నారు. వెనిజులాపై దాడిని భారత్ సహా చాలా దేశా లు తీవ్రంగా ఖండించాయి. అయినా తన స్వలాభం కోసం ఇలాంటి వికృత చర్యలకు పాల్పడుతున్న ట్రంప్.. మాట వినని దేశాలపై దాడులు చేస్తూ బెదిరింపులకు దిగడం దేనికి సంకేతంగా చూడాలి.

వెనిజులాపై దా డి ఘటనను మరిచిపోకముందే దాని పొరుగునే ఉన్న కంబోడియా, మెక్సికో, క్యూబా, కొలంబియా దేశాలకు కూడా ‘మీకు త్వరలో ఇదే గతి పట్టనుంది’ అని ట్రంప్ హెచ్చరికలు చేయడాన్ని చూస్తే ప్రపంచంలో అశాం తిని రెచ్చగొట్టే చర్యగానే భావించాల్సి ఉం టుంది. దశాబ్దాలుగా అనేక దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోవడం అలవాటే. ఫలితంగా ఆ దేశాలు నాశనమైపోయిన దా ఖలాలే ఎక్కువ. ఇందుకు అఫ్గానిస్థాన్, ఇరాక్ లాంటి దేశాలే ఉదాహరణ.

దేశాలను ఆక్రమించడంలో ఉన్నంత ఉత్సాహం, ఆ దేశాలను అభివృద్ధి పథంలో నడిపించడం లో అమెరికాకు లేదని చరిత్ర చెబుతోంది. ఏ దేశమైనా తమకు వ్యతిరేకంగా మారుతోందని భావిస్తే, అక్కడ దాడులు చేయడం, పాలకులను గద్దె దించి తమకు అనుకూలమైన వారిని కూర్చోబెట్టడం అమెరికాకు దశాబ్దాలుగా అలవాటుగా మారింది. అగ్రరాజ్యం అని పెత్తనం చెలాయించడమే త ప్పా.. ఆయా దేశాల్లో అమెరికా ఏమాత్రం అభివృద్ధి చేయడం లేదన్నది వాస్తవం. 

వెనిజులా పరిస్థితి?

2001లో అఫ్గానిస్థాన్‌పై దాడి చేసిన అ మెరికా బలగాలు తాలిబన్లను తరిమికొట్టి కాబుల్‌ను ఆక్రమించాయి. ప్రజాస్వామ్యా న్ని పునరుద్ధరిస్తున్నామని అప్పటి అధ్యక్షడు జార్జ్ బుష్ ప్రకటించారు. అమెరికా మద్దతుతో హమీద్ కర్జాయ్ ప్రభుత్వం ఏర్పాటైన ప్పటికీ, అవినీతి, బంధుప్రీతి కారణంగా ఆ పాలన ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. ఫలితంగా తాలిబన్లు మళ్ళీ పుంజుకున్నారు. చివరికి రెండు దశాబ్దాల తర్వాత అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకుని, అధికారాన్ని తిరిగి తాలిబన్లకే అప్పగించి చేతులు దులుపుకొంది.

నేడు అఫ్గాన్ ప్రజలు గతం లో కంటే దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2003లో సద్దాం హుసే న్‌ను గద్దె దించడమే లక్ష్యంగా ఇరాక్‌పై అమెరికా దండెత్తింది. అక్కడ ప్రజాస్వామ్యాన్ని స్థాపిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఆక్రమణ తర్వాత ఏర్పడిన కొన్నిరోజులకే అక్కడ మత వర్గాల మధ్య ఘర్షణలు, ఇస్లామిక్ స్టేట్  వంటి ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి.

సద్దాంను బహిరంగంగా ఉరి తీసి ప్రజలకు విముక్తి కలిగిస్తూ ఇరాక్ నుంచి బలగాలను వెనక్కి రప్పించింది. అయితే ఇరాక్ నుంచి అమెరికా వైదొలిగినప్పటికీ నేటికీ ఆ దేశం అస్థిరత, హింసతో కొట్టుమిట్టాడుతూనే ఉం ది. ఇప్పుడు అశాంతి అలుముకున్న వెనిజులాలోనూ అదే సీన్ రిపీట్ అవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. 

శాంతి అంటూనే..

ఒక వైపు రష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి మధ్యవర్తిత్వం వహిస్తూ, మరోవైపు అశాంతి కి బీజం వేయడం ట్రంప్ యుద్ధోన్మాదానికి నిదర్శనం. గత నాలుగు సంవత్సరాలుగా ర ష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు ఇరుదేశాల్లో నాలు గు లక్షలకు పైగా సైనికులు, పౌరులు మరణించారు. ఇంతటితో ఈ మారణ హోమం ఆగుతుందా? లేదా? అనే సందిగ్ధం ఏర్పడిం ది. ఇరుదేశాల మధ్య యుద్ధం పరిసమాప్తి కావాలనే ఆశతో అంతర్జాతీయ సమాజం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నది.

ఇటీవల ఫ్లోరిడాలో జెలెన్ స్కీ తో ట్రంప్  జరిపిన చర్చల వల్ల  రష్యా-, ఉక్రెయిన్ల మధ్య శాంతి ఒప్పందానికి మార్గం ఏర్పడిందని, ఇరుదేశాల మధ్య 90 శాతం వరకు అంగీకారం కు దిరిందని ట్రంప్ పేర్కొనడం ముదావహం. డాన్ బాస్ ప్రాంతం రష్యాకు వదిలేయడం, ఉక్రెయిన్ పై మరో మారు రష్యా యుద్దం చేయకుండా ఉక్రెయిన్ భద్రతకు హామీ ఇ వ్వాలనే అంశాలపై ఏర్పడిన సందిగ్ధత శాంతి ఒప్పందానికి  పీటముడిలా మారిం ది.

శాంతి చర్చలు సఫలమయ్యే దిశలో సాగుతుండగా రష్యా అధ్యక్షడు పుతిన్ అధికార నివాసం పై ఉక్రెయిన్ దాడులు జరప డం ఇరుదేశాల మధ్య శాంతి చర్చలకు  వి ఘాతంగా పరిణమించాయి. ప్రపంచంలో ఎనిమిది యుద్ధాలను ఆపడం తనకే సాధ్యమైందంటూ గొప్పగా చెప్పుకోవడం ట్రంప్ కు మాత్రమే చెల్లింది. ఆ ఎనిమిదింటిలో ఈజిప్టు థాయ్‌లాండ్- భారత్- ఇజ్రాయిల్ న్, ఇజ్రాయిల్- రువాండా- అజర్ బైజాన్- తదితర యుద్ధాలను తానే ఆపానంటూ ట్రంప్ పదే పదే ప్రకటించుకుంటూ నోబెల్ శాంతి బహుమతి కోసం పైరవీలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. 

నెరవేరని లక్ష్యాలు..

గాజా లో ఇంతటి విధ్వంసం జరగడానికి కేవలం హమాస్ ను నిందించి ప్రయోజనం లేదు. రక్తం మరిగిన ఇజ్రాయిల్ ప్రధాని  బెంజిమెన్ నెతన్యాహూ సృష్టించిన విధ్వంసంలో అమెరికా పాత్రను మరువలేము. ఇ ప్పుడు గాజాలో ఎక్కడ చూసినా ఇజ్రాయిల్ సాగించిన విధ్వంసానికి శిధిలమైన భవనాల గుట్టలు, రక్తంతో తడిచి, నిర్జీవంగా మారిన ప్రాంతాలు, పసిపిల్లల ఆకలి కేకలు, ఆప్తులను,ఆస్తులను కోల్పోయి, తిండి లేక డొక్క లు ఎండిన ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తాయి.

దారుణ మారణ హోమం జరిగిన తర్వాత ఇజ్రాయిల్ నుండి పాలస్తీనా ను విముక్తి చేయాలనే లక్ష్యంతో ఏర్పడిన తీవ్రవాద సంస్థ హమాస్‌కు  ఇజ్రాయిల్‌కు మ ధ్య శాంతి ఒప్పందం కుదర్చిన ఘనత ట్రం ప్‌కే దక్కుతుంది.  ఇరాన్- ఇజ్రాయిల్ మధ్య జరిగిన భీకర పోరాటం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని ఆందోళన చెంది న శాంతికాములకు ట్రంప్ మధ్యవర్తిత్వంతో ఇరాన్ మధ్య కుదిరిన  శాం తి ఒప్పందం స్వాంతన చేకూర్చింది.

అయితే తాను అధికారం లోకి వచ్చిన వెంటనే రష్యా- ఉక్రెయిన్ల మధ్య సంవత్సరాల తరబడి కొనసాగుతున్న యుద్ధాన్ని ఆపేస్తానని ప్రకటించి నా ఇప్పటి వరకు ఆ లక్ష్యం నెరవేరలేదు.  పైగా లాటిన్ అమెరికా దేశాలపై ట్రంప్ సాగిస్తున్న జులుం అభ్యంతరకరం.

ట్రంప్ ఆశలపై నీళ్లు..

నోబెల్ శాంతి బహుమతి వస్తే థియోడో ర్ రూస్‌వెల్ట్, వుడ్రో విల్సన్, జిమ్మీ కార్టర్, బరాక్ ఒబామాల సరసన నిలబడే అవకాశం వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కలగన్నారు. కానీ వెనిజులా కు చెందిన మహిళా నాయకురాలు, ప్రతిపక్ష నేత మరియా కొరినా మచాడో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకోవడం ట్రంప్‌కు మింగుడు పడలేదు. అందుకే పరోక్షంగా వెనిజులాపై దాడులు చేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వలసలు అరికట్టేందుకే వెనిజులాపై దాడులు చేయాల్సి వచ్చిందని పైకి చెబుతున్నా ట్రంప్ ఇదంతా చేసింది దేశంలోని చమురు నిక్షేపాల కోసమేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనతో సఖ్యంగా లేని దేశాలతో పేచీకి సిద్ధమయ్యే ట్రంప్ ముందు తాను అనుకున్న లక్ష్యం నెరవేరేవరకు మార్గాలు వెతుకుతూనే ఉంటా రు.

తాజాగా నార్కోటిక్ డ్రగ్స్‌ను నికోలస్ మదురోనే స్వయంగా ప్రోత్సహిస్తున్నారని, ఇలాం టి వారిని ఊరికే వదిలేది లేదంటూ మందీ మార్బలంతో నేరుగా అధ్యక్షుడి నివాసానికే వెళ్లి కట్టుబట్టలతో చేతులకు సంకెళ్లు వేసి నడిపించిన తీరు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. మరోవైపు లాటిన్ అమెరికా దేశాలైన కొలంబియా, గ్రీన్ లాండ్, మెక్సికో లాం టి దేశాలపై బెదిరింపులకు పాల్పడడం చేస్తున్నారు. మొత్తంగా ట్రంప్ తన అర్థంకాని చర్యలతో ప్రపంచంలో అశాంతికి చిహ్నంగా నిలుస్తున్నారు.

 వ్యాసకర్త సెల్: 9704903463