calender_icon.png 21 August, 2025 | 10:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గుడుంబాకు మాను‘కోట’!

21-08-2025 01:22:39 AM

అడ్డుకట్ట పడేదెన్నడు..?

మహబూబాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): గుడుంబా తయారు, వినియోగానికి మాను‘కోట’ పెట్టింది పేరుగా నిలుస్తోంది. గుడుంబా నిర్మూలనకు అటు ఎక్సైజ్, ఇటు పోలీస్ శాఖలు అహర్నిశలు శ్రమిస్తున్నప్పటికీ గుడుంబా తయారీకి, వినియోగానికి జిల్లాలో అడ్డుకట్ట పడడం లేదు.  గుడుంబా మహమ్మారి వల్ల అనేక కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి.

పూర్వ మాదిరిగా నాట్ సాగర్ తయారీకి సంప్రదాయ పద్ధతులు పాటించకుండా, కొత్త కొత్త పుంతలు తొక్కుతుండడంతో నాటు సారా విషపూరితంగా మారి తాగుడుకు అలవాటు పడ్డ వారి జీవితాలు అనతి కాలంలోనే గాలిలో కలుస్తున్నాయి. దీనితో మృత్యువాత పడ్డ వారి కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈ క్రమంలో గుడుంబా మహమ్మారిని నిర్మూలించడానికి గతంలో ప్రభుత్వాలు గుడుంబా తయారీ,

విక్రయాన్ని పూర్తిగా నిర్మూలించడానికి పలు కార్యక్రమాలను చేపట్టారు. గుడుంబా తయారు చేసే వారిని గుర్తించి వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలను చూపారు. కొందరికి పశువులు మరికొందరికి మేకలు, గొర్రెలు ఇతర స్వయం ఉపాధి అవకాశాల కోసం ఆర్థిక సహాయం అందించి కొంతమేర అడ్డుకట్ట వేయగలిగారు. అయితే మళ్లీ ఇటీవల మహబూబాబాద్ జిల్లాలో తయారీ కుటీర పరిశ్రమగా మారింది.

జిల్లాలో ఇక్కడ అక్కడ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ గుడుంబా తయారీ, వినియోగం, విక్రయం జోరుగా సాగుతోంది. నిత్యం గుడుంబా నిర్మూలన  కోసం ఎక్సైజ్, ఇన్ఫోసిమెంట్, సివిల్ పోలీసులు దాడుల్లో నిర్వహిస్తున్నప్పటికీ గుడుంబా మహమ్మరిని అదుపులోకి తేలేకపోతున్నారు. జిల్లా ఎస్పీగా కేకన్ సుధీర్ రామ్నాథ్ మానుకోట లో అడుగుపెట్టిన తర్వాత గుడుంబా నిర్మూలన పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించారు.

గత ఏడాది జిల్లా వ్యాప్తంగా ఎస్పీ ఆదేశాల మేరకు కొంతమేర గుడుంబా మహమ్మారికి అడ్డుకట్ట పడ్డప్పటికీ, ఇటీవల మళ్ళీ పెట్రేగిపోతుందనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల కాలంలో పోలీసులు, ఎక్సైజ్ అధికారుల దాడుల్లో పట్టుబడ్డ బెల్లం, పటిక, గుడుంబా తయారీకి వినియోగించే బెల్లం పానకం, నాటు సారా లభ్యం ఇందుకు సాక్ష్యంగా చెబుతున్నారు.

గుడుంబా జిల్లా వ్యాప్తంగా మూడు డ్రమ్ములు, ఆరు సీసాలు అన్న చందంగా విలసిల్లుతోందనే విమర్శలు వస్తున్నాయి. గుడుంబా తయారీకి పాల్పడే వారిని పట్టుకుని బైండోవర్ చేసి తిరిగి పట్టుబడితే 50 వేల రూపాయల జరిమానా సైతం అవలీలగా చెల్లిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీన్నిబట్టి జిల్లాలో గుడుంబా తయారీ, విక్రయం వల్ల వస్తున్న ఆదాయాన్ని అంచనా వేయవచ్చని చెబుతున్నారు.

గుడుంబా నిర్మూలనకు పగడ్బందీ ఏర్పాట్లు తప్పనిసరి

గుడుంబా నిర్మూలన ఎక్సైజ్, సివిల్ పోలీసులతో అడ్డుకట్ట పడే పరిస్థితి లేదని, అధికార వర్గాలు, ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు సమిష్టిగా కృషి చేస్తే తప్ప అదుపులోకి రాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గుడుంబా తయారు చేసే వారిపై కేసులు నమోదు చేయడం, జరిమానా విధించడంతో సరిపెట్టకుండా, పూర్తిగా గుడుంబా వైపు చూడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి.

గుడుంబా తయారీ వల్ల కలిగే అనర్ధాలను వారికి వివరించి, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు చూపాలి. నిరంతరం గుడుంబా తయారీ, వినియోగంపై నిఘా పెట్టాలి. గుడుంబా తయారీకి ప్రోత్సహించే వారిని కూడా బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకోవాలి. గుడుంబా సేవించే వారికి మార్పు వచ్చే విధంగా చైతన్య, అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలి.