22-08-2025 12:46:02 AM
హుస్నాబాద్, ఆగస్టు 21 : ఉమ్మడి రాష్ట్రంలో సమస్యలతో సతమతమైన గిరిజన తండాలను, స్వరాష్ట్రంలో సంబురాలతో కళకళలాడేలా చేసింది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ అన్నారు. గురువారం ఆయన హుస్నాబాద్లోని బంజారా భవన్లో జరిగిన తీజ్ ఉత్సవాల్లో పాల్గొన్నారు. గిరిజనులు ఆయనకు తమ సంప్రదాయంలో భాగంగా తలపాగా చుట్టి, శాలువాతో సత్కరించారు.
అనంతరం ఆయన గిరిజనులతో కలిసి ఉత్సాహంగా నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాకముందు గిరిజన తండాల దుర్భర పరిస్థితిని గుర్తు చేశారు. ‘ఆనాడు తండాలకు రోడ్లు లేవు. విద్యుత్తు, నీళ్ల సౌకర్యాలు లేవు. కనీస సౌకర్యాల కోసం గిరిజనులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. కానీ స్వరాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక గిరిజన సంక్షేమానికి అధిక ప్రాధాన్యాన్ని ఇచ్చాం‘ అని అన్నారు.
‘తండాలను గ్రామ పంచాయతీలుగా చేసి, వారిని పాలకులుగా మార్చాం. తండాల రూపురేఖలను పూర్తిగా మార్చాం. ప్రతి తండాకు రోడ్లు వేసి, మౌలిక సదుపాయాలు కల్పించాం. విద్యుత్తు, తాగునీటి సమస్యలను పూర్తిగా పరిష్కరించాం. ఇకపై ఏ తండాలో కూడా నీటి కోసం, విద్యుత్తు కోసం తల్లడిల్లాల్సిన అవసరం లేదు. మా ప్రభుత్వం గిరిజన బిడ్డల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది.‘ అని అన్నారు.
గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీకగా హుస్నాబాద్లో రూ. 2.20 కోట్లతో అత్యాధునిక బంజారా భవన్ను నిర్మించామని తెలిపారు. ఇది భవనం మాత్రమే కాదని, గిరిజనుల ఐక్యతకు, సాంస్కృతిక వేడుకలకు ఒక కేంద్రం అన్నారు. వ్యవసాయంపై ఆధారపడిన గిరిజనుల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి అనేక కార్యక్రమాలు చేపట్టామని సతీశ్ కుమార్ చెప్పారు. ‘గిరిజన రైతులకు పాడి పశువులు, గేదెలను అందించాం.
గిరిజన బిడ్డలు ఉన్నత చదువులు చదవడానికి గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశాం. ప్రతి తండాలోనూ మెరుగైన విద్య, వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నాం.‘ అని అన్నారు. గిరిజన సంక్షేమం పట్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం చూపిన చిత్తశుద్ధికి ఈ అభివృద్ధి కార్యక్రమాలే నిదర్శనమని ఆయన గర్వంగా చెప్పారు. ‘గత ప్రభుత్వాలు మాటలు చెప్పాయి కానీ, బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేతల్లో చేసి చూపించింది. గిరిజనుల పక్షాన ఎల్లప్పుడూ నిలబడేది బీఆర్‌ఎస్ మాత్రమే‘ అని ఆయన గిరిజనులకు హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో మాజీ జడ్పీటీసీలు బీలునాయక్, మంగ, మాజీ ఎంపీపీలు మానస, లక్ష్మి పాల్గొన్నారు