calender_icon.png 22 August, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి చర్యలు

22-08-2025 01:03:34 PM

కొత్త అసైన్మెంట్ భూములకు అర్హుల జాబితా సిద్ధం చేయాలి

రెవెన్యూ శాఖ సమీక్షలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష 

పెద్దపల్లి,(విజయక్రాంతి): భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం భూ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష(District Collector Koya Sri Harsha) అన్నారు. శుక్రవారం  సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్  కోయ శ్రీ హర్ష రెవెన్యూ శాఖ పై  అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన భూ సమస్యల దరఖాస్తుల పరిష్కారం,  భూ భారతి దరఖాస్తుల, ప్రజావాణి దరఖాస్తులు, మీ సేవా దరఖాస్తులు, పెండింగ్  భూ సేకరణ తదితర అంశాల పై కలెక్టర్ మండలాల వారీగా సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, రెవెన్యూ సదస్సులో వచ్చిన దరఖాస్తులకు నోటీసుల జారీ పూర్తి చేశామని, ఈ దరఖాస్తుల ఆన్ లైన్ లో నమోదు చేసి భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం అర్హత ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు.

భూ భారతి పోర్టల్ ద్వారా వచ్చే దరఖాస్తులను నిర్ణిత గడువు లోగా పూర్తి చేయాలని అన్నారు. ప్రతి మండలంలో గ్రామాల వారిగా కొత్త అసైన్మెంట్ కోసం వచ్చిన దరఖాస్తుల, అర్హుల వివరాల జాబితా అందించాలని అన్నారు. ఆగస్టు నెలాఖరు వరకు భూ సమస్యల  దరఖాస్తులు ఆన్ లైన్ నమోదు పూర్తి చేయాలని  కలెక్టర్ ఆదేశించారు. ప్రైవేటు పట్టా భూములలో సదా బైనమా దరఖాస్తులను హైకోర్టు అనుమతి వచ్చిన తర్వాత పరిశీలించాలని కలెక్టర్ తెలిపారు.  పీఓటీ కేసులలో కొత్త అసైన్మెంట్ భూమి కింద ప్రభుత్వం లబ్ధి చేకూర్చేందుకు అర్హుల జాబితా  సిద్ధం చేసుకోవాలని, ప్రభుత్వ తదుపరి ఆదేశాల ప్రకారం ఈ అసైన్మెంట్  చేయడం జరుగుతుందని,నూతన ఆర్వోఆర్ భూ భారతి చట్టం నిబంధనల ప్రకారం అర్హత ఉన్న ప్రతి దరఖాస్తు పరిష్కరించాలని అన్నారు. మనమే రెవెన్యూ సదస్సులు నిర్వహించి దరఖాస్తులు తీసుకుని  తిరస్కరిస్తే అనవసరంగా  అసంతృప్తి వస్తుందని, అర్హత ఉన్న ప్రతి దరఖాస్తు తప్పనిసరిగా పరిష్కరించాలని, తిరస్కరించే దరఖాస్తులు ఏదైనా డాక్యుమెంట్ ఉంటే ఆమోదించే పరిస్థితి ఉంటే వాటిని ఫాలో అప్ చేయాలని అన్నారు. భూ సమస్యల దరఖాస్తుల డిస్పోజల్ వేగంగా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ డివిజన్ అధికారులు బి.గంగయ్య, సురేష్ , ఏడి సర్వే ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాస్ , తహసిల్దార్ లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.