27-09-2025 03:25:38 PM
బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్..
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధన ధ్యేయంగా తన చివరి క్షణాల వరకు అలుపెరుగని పోరాటం చేసిన గొప్ప పోరాట యోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని బీసీ సమాజ్ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మోడల శ్రీనివాస్ సాగర్ అన్నారు. శనివారం నగరంలోని పద్మావతి కాలనీలో గల కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి వివిధ కుల సంఘ పెద్దలు, నాయకులు, ప్రజాసంఘాల నాయకులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ మూడుతరాల పాటు, తెలంగాణ ప్రజల హక్కుల కోసం సామాజిక న్యాయం కోసం జీవితాంతం కృషి చేశారన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాపూజీ ఎనలేని సేవలను చేశారన్నారు. తెలంగాణ ఉద్యమంలో బాపూజీ కీలకపాత్ర పోషించి, సాయుధ పోరాటం నుంచి రాజకీయ పోరాటం చేశారని కొనియాడారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సాధనే లక్ష్యంగా సమాజంలోని ప్రతి వర్గానికి స్ఫూర్తిదాయకంగా నిలిచారని, ఆయన చూపిన మార్గం, విలువలు అందరికీ స్పూర్తిదాయకం కావాలని ఆయన కోరారు. బాపూజీ చరిత్ర భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత డిఇఓ విజయ్ కుమార్, పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు సారంగి లక్ష్మికాంత్, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గన్న, బీసీ జిల్లా నాయకుడు అజయ్ కుమార్ యాదవ్, కవి భీంపల్లి శ్రీకాంత్, నాయి బ్రాహ్మణ సంఘం పట్టణ అధ్యక్షుడు అశ్విని శేఖర్, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ డీకే నాయి, మాజీ సర్పంచ్ మహేష్ గౌడ్, కుమ్మరి సంఘం పట్టణ అధ్యక్షుడు నాగప్ప తదితరులు పాల్గొన్నారు.