calender_icon.png 27 September, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన టౌన్ ప్లానింగ్ ఆఫీసర్

27-09-2025 04:05:59 PM

రూ.3.50 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టివేత..

మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ జిల్లా(Medchal District) ఎల్లంపేట మున్సిపాలిటీ ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ టి రాధాకృష్ణారెడ్డి రూ.3.50 లక్షలు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. ఏసీబీ, డి.ఎస్.పి గంగసాని శ్రీధర్ కథనం ప్రకారం.. ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని సోమారం గ్రామం వద్ద మూడేళ్ల క్రితం లేఔట్ చేసిన గంగస్థాన్ వెంచర్ యజమానులను డబ్బులు డిమాండ్ చేశారు. గంగస్థాన్ వెంచర్ కు హెచ్ఎండిఏ అనుమతి తీసుకున్నారు. పక్కన ఉన్న భూ యజమానులకు రాకపోకలకు వీలుగా రోడ్లు ఉండాలని నిబంధన ఉంది. కానీ వీరు రోడ్ల వద్ద గేట్లు ఏర్పాటు చేశారు. దీనిని ఆసరా చేసుకొని గేట్లు తొలగిస్తానని, ప్రహరీ కూల్చి వేస్తానని బెదిరించారు. లేదంటే తనకు రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో యజమానులు వారం రోజుల క్రితం లక్ష రూపాయలు ముట్ట చెప్పారు. రూ .3.50 లక్షలు శనివారం ఇవ్వడానికి బాధితులు ఫోన్ చేయగా కొంపల్లిలోని రాయిచందని మాల్ వెనుకకు రావాలని రాధాకృష్ణారెడ్డి సూచించారు. 

బాధితుడు అక్కడికి వెళ్లగా డబ్బులు బ్యాగును కారు డాష్ బోర్డులో పెట్టించుకున్నాడు. ఇంతలోనే ఏసీబీ అధికారులు టిపిఓ రాధాకృష్ణారెడ్డిని పట్టుకున్నారు.  ఎడమ చేతికి  న్యాప్టాలిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. ఆ తర్వాత ఆయనను ఎల్లంపేట మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు.  అతని ఇంట్లో, మున్సిపల్ కార్యాలయంలో సోదాలు చేశారు. కేసు విచారిస్తున్నామని డి.ఎస్.పి వివరించారు. మున్సిపల్ కమిషనర్ స్వామిని రమ్మని సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చామని, మధ్యాహ్నం వరకు కూడా రాలేదని తెలిపారు. కమిషనర్ రాకపోవడంతో అనుమానాలు వస్తున్నాయని, పూర్తిగా విచారించే వరకు ఏమి చెప్పలేమన్నారు. టీపిఓ ఒక్కరి మీదనే బాధితుడు ఫిర్యాదు చేశారని తెలిపారు. టీపిఓ కారు సీజ్ చేశామని తెలిపారు. ప్రజలు ఏ అధికారి లంచం అడిగిన ఇవ్వద్దని, ఎవరైనా డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. టోల్ ఫ్రీ నెంబర్ 24 గంటలు పనిచేస్తుందన్నారు.