27-09-2025 04:15:42 PM
యువత భవిష్యత్తుకు కొత్త దిశ..
తంగళ్ళపల్లి (విజయక్రాంతి): ఏటీసీ ద్వారా కలిగే ప్రధాన ప్రయోజనాలు విద్యార్థులకు ఆధునిక నైపుణ్యాలపై శిక్షణ లభిస్తుంది. వివిధ రంగాలలో పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులు సిద్ధమవుతాయి. స్థానికంగా ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. గ్రామీణ యువత నగరాలకే పరిమితం కాకుండా గ్రామంలోనే మంచి ట్రైనింగ్ పొందగలరు. కంప్యూటర్, టెక్నాలజీ, సాఫ్ట్ స్కిల్స్ లో శిక్షణతో పాటు పరిశ్రమలకు అవసరమైన ప్రాక్టికల్ అవగాహన లభిస్తుంది. జిల్లాలో తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ఏటీసీ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Whip Aadi Srinivas) ఘనంగా ప్రారంభించారు. గ్రామంలోని ఐటీసీ కాలేజీ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ ఆధునిక శిక్షణ కేంద్రాన్ని ఆయన చేతుల మీదుగా ప్రారంభించడంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో ఉద్యోగావకాశాలను సాధించాలంటే కేవలం చదువులు మాత్రమే కాకుండా ప్రాక్టికల్ ట్రైనింగ్, ఆధునిక టెక్నాలజీలపై అవగాహన అవసరం.. ఈ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా స్థానిక యువతకు అటువంటి శిక్షణ అందుతుంది.
తద్వారా గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు కూడా గ్లోబల్ స్థాయిలో పోటీపడే స్థాయికి చేరతారు” అని అన్నారు. అలాగే ఆయన ఏటిసి లాంటి సెంటర్లు ఒక గ్రామం నుంచి మొత్తం మండలానికి, జిల్లాకు, చివరికి రాష్ట్రానికి అభివృద్ధి దిశగా దోహదపడతాయి. ఇది కేవలం ఒక శిక్షణ కేంద్రం మాత్రమే కాదు, విద్యార్థుల భవిష్యత్తు విజయాలకు పునాది” అని అన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సాంప్రదాయ బజాలు, పూలమాలలతో ఆది శ్రీనివాస్‌ను ఆహ్వానించగా, ఆయన యువతతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ఈ ఐటీసీ కాలేజీ &అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ తంగాలపల్లి మండలానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు.