10 June, 2026 | 1:34 AM

ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి

10-06-2026 12:13 AM

ఇల్లందు టౌన్, జూన్ 9 (విజయక్రాంతి): ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టి విద్యను అందరికీ అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర నాయకులు చాందావత్ రమేష్ బాబు, పట్టణ అధ్యక్షుడు దాసరి గోపాలకృష్ణ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు అని, వ్యాపారం కాదని అన్నారు. ప్రతి ఏడాది జూన్ నెల రాగానే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలవుతోందని, ప్రైవేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచుతూ పుస్తకాలు, యూనిఫారాలు, ఇతర విద్యా సామగ్రి పేరుతో అధిక భారం మోపుతున్నాయని విమర్శించారు.

పుస్తకాల దుకాణాలు బిల్లులు ఇవ్వకుండా తమకు నచ్చిన ధరలకు విక్రయాలు చేస్తుండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న కొన్ని విద్యాసంస్థలు కనీస సౌకర్యాలు కూడా కల్పించకుండా నిర్వహణ సాగిస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోకపోవడం విచారకరమని అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం దృష్టి సారించకపోవడాన్ని తప్పుబట్టారు. ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రించడంతో పాటు పుస్తకాల విక్రయాల్లో పారదర్శకత తీసుకురావాలని, బిల్లు లేకుండా విక్రయాలు చేసే దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. జూన్ నెల అంటేనే భయపడే పరిస్థితి కాకుండా ప్రతి పిల్లవాడికి అందుబాటులో విద్య లభించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కామ ప్రణయ్, ముక్కు శ్రీవెద్, మౌనిష్, సోను  పాల్గొన్నారు.