calender_icon.png 16 December, 2025 | 10:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టిక్ టిక్.. హైటెన్షన్

16-12-2025 02:00:40 AM

నేడే జీహెఎంసీ ప్రత్యేక కౌన్సిల్

  1. ఉదయం 10:30 గంటలకు మేయర్ అధ్యక్షతన కీలక భేటీ
  2. వార్డుల విభజనపై రచ్చ తప్పదా?
  3. అజెండా ఒక్కటే.. 300 వార్డుల పునర్విభజన, 27 పురపాలికల విలీనం
  4. డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌పై సభ్యుల అభిప్రాయాలు, అభ్యంతరాల సేకరణ
  5. బౌండరీల మార్పుపై భగ్గుమంటున్న బీజేపీ, ఎంఐఎం
  6. గ్రేటర్ వార్డుల పెంపుపై గులాబీ గరం
  7. అశాస్త్రీయం అంటూ నిలదీసేందుకు విపక్షాలు సిద్ధం

హైదరాబాద్, సిటీ బ్యూరో డిసెంబర్ 15 (విజయక్రాంతి):  గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో అత్యంత కీలకమైన, రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ప్రత్యేక కౌన్సిల్ సమావేశం మంగళవారం జరగనుంది. జీహెఎంసీ ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్ హాల్లో ఉదయం 10:30 గంటలకు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన ఈ భేటీ ప్రారంభం కానుంది. నగరాన్ని మెగా సిటీగా మారుస్తూ 27 మున్సిపాలిటీలను విలీనం చేయడం, వార్డుల సంఖ్యను 300కు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించనున్నారు.

అజెండా ఇదే..

సాధారణంగా కౌన్సిల్ సమావేశాల్లో అనేక అంశాలపై చర్చ జరుగుతుంది. కానీ, ఈసారి కేవలం వార్డుల పునర్విభజన అనే ఒక్క అజెండానే చర్చకు రానుంది. ప్రభుత్వం జారీ చేసిన జీఓ నం. 266, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఫారం-1ను కమిషనర్ ఆర్వీ కర్ణన్ కౌన్సిల్ ముందు ఉంచనున్నారు. కొత్తగా ఏర్పడిన 300 వార్డుల సరిహద్దులు, విలీన ప్రక్రియపై ఎక్స్ అఫీషియో సభ్యులు, కార్పొరేటర్ల నుంచి సూచనలు, సలహాలు, అభ్యం తరాలను స్వీకరించనున్నారు.

వార్డుల విభజన ప్రక్రియపై ఇప్పటికే రాజకీయ రగడ మొదలైంది. ఈ నేపథ్యంలో నేటి సమావేశం వాడివేడిగా సాగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వార్డుల విభజన పూర్తిగా అశాస్త్రీయంగా జరిగిందని, కేవలం ఎంఐ ఎం పార్టీకి లబ్ధి చేకూర్చేలా గీతలు గీశారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. ప్రజాభిప్రాయం తీసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని, దీనిపై కౌన్సిల్లో గట్టిగా నిలదీయాలని, అవసరమైతే ఆందోళన చేయాలని కమలనాథులు వ్యూహరచన చేశారు.

తమకు పట్టున్న ప్రాంతాల్లో డివిజన్లను ఇష్టారాజ్యంగా మార్చేశారని ఎంఐఎం కూడా అసంతృప్తితో ఉంది. బౌండరీల మార్పుపై ఆ పార్టీ సభ్యులు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేసే అవకాశం ఉంది. 27 మున్సిపాలిటీలను విలీనం చేస్తూ, డివిజన్ల సంఖ్యను ఏకపక్షంగా 300కు పెంచడంపై గులాబీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఇప్పటికే మేయర్ను కలిసి తమ డివిజన్ల సరిహద్దులపై వినతులు ఇచ్చారు. వాటిని కౌన్సిల్ దృష్టికి తెచ్చి రికార్డు చేయించనున్నారు.

భారీ భద్రత..

సమావేశంలో ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మార్షల్స్‌ను సిద్ధంగా ఉంచారు. సమావేశం అనంతరం సభ్యులు వ్యక్తం చేసిన అభిప్రాయాలను, అభ్యంతరాలను క్రోడీకరించి జీహెఎంసీ కమిషనర్ ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ఈ సమావేశం గ్రేటర్ ఎన్నికలకు శంఖారావంగా మారనుందా అన్నది వేచి చూడాలి.