calender_icon.png 16 December, 2025 | 6:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డివిజన్ల పునర్విభజనపై హీట్

16-12-2025 01:57:50 AM

  1. మేయర్‌తో కాంగ్రెస్ నేతల భేటీ 
  2. సరిహద్దుల మార్పుపై అభ్యంతరాలు.. వినతి పత్రాలు అందజేత 
  3. స్పెషల్ కౌన్సిల్ మీటింగ్‌లో చర్చించాకే ప్రభుత్వానికి నివేదిక 
  4. మేయర్‌తో ఎమ్మెల్యేలు దానం, అరికెపూడి తదితరుల భేటీ
  5. సభ్యులందరికీ మాట్లాడే అవకాశం ఇస్తామన్న మేయర్ విజయలక్ష్మి

హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 15 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్‌ను 300 డివిజన్లుగా పునర్విభజిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరందుకుంది. కొత్త డివిజన్ల సరిహద్దులు, భౌగోళిక స్వరూపంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సోమవారం నగరానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ ఆర్వీ కర్ణన్లతో వేర్వేరుగా సమావేశమయ్యారు.

ఎమ్మెల్యేలు దానం నాగేందర్, అరి కెపూడి గాంధీ, ప్రకాష్‌గౌడ్, ఎమ్మెల్సీ బల్మూ రి వెంకట్ తదితరులు తమ అనుచర కార్పొరేటర్లతో కలిసి బల్దియా ప్రధాన కార్యాల యానికి వచ్చారు. కొత్తగా ఏర్పాటు చేసిన డివిజన్ల సరిహద్దులపై తమకున్న అభ్యంతరాలను, క్షేత్రస్థాయి సమస్యలను మేయర్, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. సరిహద్దులపై మార్కింగ్ చేసిన వినతి పత్రాలను అధికారులకు అందజేశారు.

ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ డివిజన్ల పునర్విభజనపై సభ్యుల అభిప్రాయాలు, సూచన లు, సలహాలు తీసుకునేందుకు మంగళవారం ప్రత్యేకంగా జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తున్నాం. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లకు మాట్లాడే అవకాశం కల్పిస్తాం. సభ్యులు ఇచ్చే ఇన్-పుట్స్‌ను, అభ్యంతరాలను క్రోడీకరించి ప్రభుత్వానికి నివేదిస్తాం అని హామీ ఇచ్చారు.

రాష్ర్ట ప్రభుత్వం జీహెచ్‌ఎంసీని విస్తరిస్తూ, వార్డుల సంఖ్యను 300కు పెంచుతూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే పాత డివిజన్లతో పోలిస్తే కొత్త వాటి సరిహద్దుల్లో భారీ మార్పులు జరగడంతో.. అధికార, విపక్ష నేతల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో నేడు జరగబోయే కౌన్సిల్ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.